Virat Kohli: కోహ్లీ నుంచి ఫెంటాస్టిక్ ఇన్నింగ్స్... ఫైనల్లో టీమిండియా భారీ స్కోరు
- నేడు టీమిండియా-దక్షిణాఫ్రికా మధ్య టీ20 వరల్డ్ కప్ ఫైనల్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
- 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసిన టీమిండియా
- 59 బంతుల్లో 76 పరుగులు చేసిన కోహ్లీ
- రాణించిన అక్షర్ పటేల్, శివమ్ దూబే
ఈ వరల్డ్ కప్ ఆరంభం నుంచి వరుసగా విఫలమవుతూ వస్తున్న విరాట్ కోహ్లీ... ఇవాళ దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్ లో జూలు విదిల్చాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ తో టీమిండియా బ్యాటింగ్ ను నిలబెట్టడమే కాకుండా, జట్టు భారీ స్కోరు సాధించడంలో ముఖ్య పాత్ర పోషించాడు.
వెస్టిండీస్ లోని బ్రిడ్జిటౌన్ లో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. కోహ్లీ 59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 76 పరుగులు చేశాడు. ఓ దశలో టీమిండియా 34 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
కెప్టెన్ రోహిత్ శర్మ 9 పరుగులకే అవుట్ కాగా, అదే ఓవర్లో కేశవ్ మహరాజ్ బౌలింగ్ లో చెత్త షాట్ ఆడి రిషబ్ పంత్ (0) కూడా వెనుదిరిగాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ సైతం పెవిలియన్ చేరడంతో టీమిండియా కష్టాల్లో పడ్డట్టే కనిపించింది.
అయితే అక్షర్ పటేల్ తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ ను నడిపించిన తీరు అద్భుతం. ఓ వైపు తాను దూకుడుగా ఆడుతూ, ఇతర బ్యాటర్లు కూడా ధాటిగా ఆడే వాతావరణం సృష్టించాడు. కోహ్లీ అండతో అక్షర్ పటేల్ చెలరేగాడు. అక్షర్ 31 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 47 పరుగులు చేసి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు.
మరో ఎండ్ లో శివమ్ దూబే కూడా ధాటిగా ఆడడంతో టీమిండియా స్కోరు 150 మార్కు దాటింది. దూబే 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ తో 27 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ 2, ఆన్రిచ్ నోర్కియా 2, మార్కో యన్సెన్ 1, కగిసో రబాడా 1 వికెట్ తీశారు.