Secunderabad Contonment: జీహెచ్ఎంసీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనానికి గ్రీన్ సిగ్నల్
- తెలంగాణ చీఫ్ సెక్రెటరీతో రక్షణ శాఖ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్
- అనంతరం కంటోన్మెంట్ విలీనానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం
- విలీనానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సదరన్ కమాండ్ డిప్యూటీ డైరెక్టర్ ఆదేశాలు
- కంటోన్మెంట్లోని సివిల్ ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనానికి మార్గం సుగమమైంది. ఈ నెల 25న కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్.. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ శాంతికుమారితో వీడియో కాన్ఫరెన్స్లో వారి అభిప్రాయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కంటోన్మెంట్ విలీనానికి అంగీకరించడంతో రక్షణ శాఖ ప్రిన్సిపల్ ప్యూటీ డైరెక్టర్ సదరన్ కమాండ్ హేమంత్ యాదవ్ కంటోన్మెంట్ బోర్డు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కంటోన్మెంట్లోని సివిల్ ఏరియాలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తారు. అక్కడి ప్రజలకు నిర్దేశించిన సౌకర్యాలు, మౌలిక వసతులన్నీ ఉచితంగా జీహెచ్ఎంసీకి బదిలీ చేస్తారు. కంటోన్మెంట్ బోర్డుల ఆస్తులు, అప్పులన్నీ మున్సిపాలిటికీ బదిలీ అవుతాయి. మిలటరీ స్టేషన్ మినహా కంటోన్మెంట్లోని నివాస ప్రాంతాలకు జీహెచ్ఎంసీ పరిధి విస్తరిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరిపి చర్యలు తీసుకోవాలని రక్షణశాఖ బోర్డు అధికారులను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం పేరిట ఉన్న భూములు, ఆస్తులు కేంద్రానికే దక్కుతాయి. ఈ ప్రాంతాలను విభజించేటప్పుడు సాయుధ దళాల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కంటోన్మెంట్ బోర్డు బాధ్యుల సందేహాలను నివృత్తి చేసి తదుపరి కార్యాచరణ చేపట్టాలని కేంద్రం సూచించింది.