Volunteers: వాలంటీర్లపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుంది: మంత్రి పార్థసారథి
- ఏపీలో రేపు పెన్షన్ల పంపిణీ
- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి పెన్షన్ల అందజేత
- పెంపుతో కలిపి రేపు రూ.7 వేల పెన్షన్ అందించనున్న చంద్రబాబు సర్కారు
రేపు జులై 1 కాగా, పెంచిన పెన్షన్ల పంపిణీకి ఏపీ సర్కారు సన్నద్ధమవుతోంది. ఏప్రిల్ నుంచి పెంచిన మేర రూ.3 వేలు, నెలవారీ పెన్షన్ రూ.4 వేలు కలిపి రేపు లబ్ధిదారులకు రూ.7 వేలు అందించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెంచిన పెన్షన్లు అందుకోనున్న తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
దీనిపై ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పందించారు. లబ్ధిదారులకు ఇంటి వద్దనే పెన్షన్లు అందజేస్తామని స్పష్టం చేశారు. పెన్షన్ రూ.1000 పెంచేందుకు వైసీపీకి ఐదేళ్లు పట్టిందని విమర్శించారు. ఇక, వాలంటీర్లపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.
కాగా, ఏపీలో తొలి రోజే వంద శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికార యంత్రాంగం ఆ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో, ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ జరగాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, ఇతర శాఖలకు చెందిన క్షేత్రస్థాయి సిబ్బంది లబ్ధిదారులకు ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు అందించాలని స్పష్టం చేశారు.
అటు, తాడేపల్లి మండలం పెనుమాకలో సీఎం చంద్రబాబు రేపు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేయనున్నారు.