Sachin Tendulkar: కెరీర్ కు ఇంతకంటే గొప్ప ముగింపు ఇంకేం ఉంటుంది?: సచిన్ టెండూల్కర్
- టీ20 వరల్డ్ కప్ సాధించిన టీమిండియా
- వరల్డ్ కప్ విజయంతో టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, కోహ్లీ
- ఇరువురికి శుభాకాంక్షలు తెలిపిన సచిన్ టెండూల్కర్
టీ20 వరల్డ్ కప్ గెలిచిన వెంటనే టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ స్పందించారు. కెరీర్ ను ఘనంగా ముగించారని సచిన్ కొనియాడారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఉద్దేశించి తన అభిప్రాయాలను ఎక్స్ లో పంచుకున్నారు.
"రోహిత్ శర్మ... నువ్వు ప్రతిభావంతుడైన యువ ఆటగాడిగా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్ గా ఎదిగేంత వరకు నీ ప్రస్థానాన్ని దగ్గర్నుంచి చూస్తూనే ఉన్నాను. నీ అచంచలమైన నిబద్ధత, ప్రత్యేకమైన నైపుణ్యం దేశానికి అత్యంత గర్వకారణంగా నిలిచాయి. నీ తిరుగులేని కెరీర్ కు టీ20 వరల్డ్ కప్ విజయంతో ముగింపు పలకడం పర్ఫెక్ట్ గా సరిపోయింది. వెల్డన్ రోహిత్!" అంటూ సచిన్ రోహిత్ శర్మను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
సచిన్ అదే ట్వీట్ లో విరాట్ కోహ్లీని ఉద్దేశించి కూడా స్పందించారు. "విరాట్ కోహ్లీ... క్రికెట్ ఆటలో నిజమైన చాంపియన్ అంటే నువ్వే. ఈ టోర్నమెంట్ మొదట్లో నువ్వు కొన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నావు. కానీ, ఈ జెంటిల్మెన్ క్రీడలో నువ్వు ఎందుకు గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా పేరుపొందావో గత రాత్రి నీ ఆట చూస్తే అర్థమవుతుంది. ఆరు వరల్డ్ కప్ ల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించి, చివరి ప్రయత్నంలో వరల్డ్ కప్ సాధించడం ఎంతటి మధురానుభూతిని కలిగిస్తుందో నాకు కూడా తెలుసు. ఇకమీదట నువ్వు టెస్టులు, వన్డేల్లో టీమిండియాకు విజయాలు అందించేందుకు పాటుపడతావని ఆశిస్తున్నాను" అంటూ సచిన్ పేర్కొన్నారు.