Bandi Sanjay: కొండగట్టులో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందన
- తెలంగాణలో జనసేన క్రియాశీలకంగా ఉంటుందన్న పవన్ కల్యాణ్
- బీజేపీతో కలిసి కొనసాగుతామని వెల్లడి
- జనసేన ప్రతిపాదన గురించి బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్న బండి సంజయ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిన్న తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. తెలంగాణలోనూ జనసేన క్రియాశీలకంగా ఉంటుందని, తెలంగాణలోనూ తాము బీజేపీతో కలిసి కొనసాగుతామని పవన్ చెప్పారు. దీనిపై కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ స్పందించారు.
"పవన్ కల్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడిగా తన ఆలోచనను ప్రకటించారు. ఆయన ఆలోచన మంచిదే కావొచ్చు. మా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు. జనసేన వాళ్లే ముందుగా ప్రతిపాదన తీసుకువచ్చారు కాబట్టి... దానిపై మా రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు, పార్టీలో అందరూ కూర్చుని చర్చిస్తాం. ప్రజల అభిప్రాయం, కార్యకర్తల అభిప్రాయం, నాయకుల అభిప్రాయం సేకరించి అందుకు అనుగుణంగా వ్యవహరిస్తాం. అంతేతప్ప, ఎవరికి వారుగా పొత్తుపై నిర్ణయం తీసుకోలేం... మాది అలాంటి పార్టీ కాదు. జనసేన పార్టీ ప్రతిపాదను బీజేపీ నాయకత్వం చూసుకుంటుంది" అని బండి సంజయ్ వివరించారు.
తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన పొత్తు పెట్టుకుని పోటీ చేసిన సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేన 8 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా, డిపాజిట్లు గల్లంతయ్యాయి.