ICC: ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ ప్రకటించిన ఐసీసీ.. టీమిండియా నుంచి ఆరుగురి పేర్లు.. కోహ్లీకి దక్కని చోటు
- భారత్ నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, బుమ్రాలకు చోటు
- హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అర్షదీప్‌లను కూడా చేర్చిన ఐసీసీ
- టీ20 వరల్డ్ కప్ 2024లో రాణించిన ఆటగాళ్లతో బెస్ట్ టీమ్ ప్రకటన
టీ20 వరల్డ్ కప్ 2024 ముగిసిపోవడంతో ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ పేరిట 11 మంది సభ్యుల బెస్ట్ టీమ్‌ను ఐసీసీ ప్రకటించింది. టోర్నమెంట్ గెలిచిన భారత జట్టు నుంచి ఆరుగురు ఆటగాళ్లకు ఇందులో చోటు దక్కింది. ఐసీసీ ప్రకటించిన జట్టులో తొలి పేరు రోహిత్ శర్మదే కావడం విశేషం. సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్‌లకు కూడా చోటుదక్కింది. అయితే ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన కింగ్ విరాట్ కోహ్లీకి చోటు దక్కలేదు.
ఐసీసీ బెస్ట్ టీమ్ ఇదే..
రోహిత్ శర్మ, రహ్మానుల్లా గుర్బాజ్, నికోలస్ పూరన్, సూర్యకుమార్ యాదవ్, మార్కస్ స్టోయినిస్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, ఫజల్హక్ ఫరూఖీ(12వ ఆటగాడు).
టీ20 వరల్డ్ కప్ 2024లో రోహిత్ శర్మ 156 స్ట్రైక్ రేట్‌తో 257 పరుగులు చేశాడు. గత 18 నెలల్లో రోహిత్ అద్భుతమైన క్రికెట్ ఆడాడు. టీమిండియాను ఏకంగా మూడు ఐసీసీ టోర్నమెంట్లలో ఫైనల్‌కు తీసుకెళ్లాడు. ఇక ఆఫ్ఘనిస్థాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ ఈ సీజన్లో 281 పరుగులు బాది టోర్నమెంట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఆఫ్ఘనిస్థాన్ సెమీ-ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక వెస్టిండీస్‌కు అత్యుత్తమ ఆటగాడు నికోలస్ పూరన్, ఆస్ట్రేలియన్ ఆల్-రౌండర్ మార్కస్ స్టోయినిస్ ఐసీసీ ప్రకటించిన జట్టు మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లుగా ఉన్నారు.
ఫైనల్ మ్యాచ్‌లో గొప్పగా బ్యాటింగ్ చేయలేకపోయినప్పటికీ అద్భుతమైన క్యాచ్ పట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పిన సూర్యకు కూడా చోటుదక్కింది. టోర్నీలో అమెరికా, ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్ జట్లపై అద్భుతంగా రాణించాడు. ఇక టీమిండియా స్టార్ ఆల్ రౌండ్ స్టార్లు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ కూడా టాప్ 7 జాబితాలో ఉన్నారు.
ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ను స్పిన్నర్‌గా ఐసీసీ ఎంపిక చేసింది. అక్షర్ పటేల్‌ను ఆల్‌రౌండర్‌గా, పేస్ త్రయంగా జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, ఫజల్హాక్ ఫరూఖీలకు చోటు కల్పించింది. ఇక వరల్డ్ కప్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడు పేసర్ అన్రిచ్ నోర్ట్జే 12వ ఆటగాడిగా ఎంపికయ్యాడు.