Waterfall: కళ్ల ముందే కొట్టుకుపోయారు.. లోనావాలా జలపాతంలో కుటుంబం గల్లంతు.. వీడియో ఇదిగో!
- నిస్సహాయంగా చూస్తుండిపోయిన మిగతా టూరిస్టులు
- అతికష్టమ్మీద ఒడ్డుకు చేరిన ఇద్దరు
- మూడు మృతదేహాల గుర్తింపు.. మరో ఇద్దరి కోసం గాలింపు
ముంబై సమీపంలోని లోనావాలా జలపాతం వద్ద ఆదివారం ఘోరం చోటుచేసుకుంది. నీటి ఉద్ధృతి పెరగడంతో ఓ కుటుంబానికి చెందిన ఏడుగురు కొట్టుకుపోయారు. సాయం కోసం వాళ్లు చేస్తున్న ఆర్తనాదాలు వింటూ మిగతా టూరిస్టులు నిస్సహాయంగా చూస్తు ఉండిపోయారు. వారిలో ఇద్దరు మాత్రం బతికిబయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం జలపాతం వద్ద టూరిస్టులు సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు. ముంబైకి చెందిన ఓ కుటుంబం జలపాతం వద్దకు విహారయాత్రకు వచ్చింది. ఏడుగురు కుటుంబ సభ్యులు నీళ్లలో ఎంజాయ్ చేస్తుండగా.. సడెన్ గా నీటి ప్రవాహం పెరిగింది. దీంతో నీళ్లలో కొట్టుకుపోకుండా ఏడుగురూ ఒకరినొకరు పట్టుకుని నిలబడ్డారు. సాయం కోసం ఆర్తనాదాలు చేస్తూ.. ఒడ్డుకు చేరేందుకు ప్రయత్నించారు. అయితే, నీటి ఉద్ధృతి కారణంగా వారికి సాయం చేయలేకపోయామని మిగతా టూరిస్టులు చెప్పారు. చూస్తుండగానే వారంతా నీళ్లలో కొట్టుకుపోయారు.
అందులో ఇద్దరు మాత్రం అతికష్టమ్మీద ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకునేలోగా ఇదంతా జరిగిపోయింది. నీళ్లలో గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టిన సిబ్బంది మూడు మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. జలపాతంలోని నీరు కింద ఉన్న భూసి డ్యామ్ లోకి చేరుతుందని వివరించారు.