Rahul Gandhi: స్పీకర్ వంగి మోదీకి షేక్ హ్యాండ్ ఇచ్చారన్న రాహుల్ గాంధీ... అది నా సంస్కారమన్న ఓంబిర్లా
- లోక్ సభలో స్పీకర్, ప్రతిపక్ష నేత మధ్య స్వల్ప వాగ్వాదం
- తనకు నిటారుగా నిలబడి షేక్ హ్యాండ్ ఇచ్చారన్న రాహుల్ గాంధీ
- మోదీ వయస్సులో తనకంటే పెద్దవారని ఓం బిర్లా వివరణ
లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. స్పీకర్ ని ఉద్దేశించి, 'పార్లమెంట్లో ప్రధాని మోదీకి మీరు వంగి షేక్ హ్యాండ్ ఇచ్చారు , కానీ నాకు మాత్రం నిటారుగా నిలబడి ఇచ్చారు. ఈ విషయాన్ని నేను గమనించాను' అన్నారు రాహుల్ .
ఈ వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభ్యంతరం వ్యక్తం చేశారు.
అదే సమయంలో రాహుల్ గాంధీకి స్పీకర్ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీ సభా నాయకుడని, వయస్సులో తనకంటే పెద్దవారని, సీనియర్లను గౌరవించాలనే సంస్కారం తనదని ఓం బిర్లా పేర్కొన్నారు. 'నా సీనియర్లు లేదా పెద్దలకు నమస్కరించాలని లేదా గౌరవంచాలని, తోటివారికి సమాన గౌరవం ఇవ్వాలని నేను నేర్చుకున్నాను' అని ఓం బిర్లా పేర్కొన్నారు.
దీనిపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ... మీరు చెప్పిన మాటలతో ఏకీభవిస్తున్నానని... కానీ ఇక్కడ సభాపతి కంటే ఎవరూ పెద్ద కాదనే విషయం గుర్తించాలన్నారు. మీరు సభా నాయకుడి ముందు తలవంచాల్సిన అవసరం లేదన్నారు. జూన్ 26న, లోక్ సభ స్పీకర్గా ఓం బిర్లా తిరిగి ఎన్నికయ్యాక ఆయనకు ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభినందనలు తెలుపుతూ కరచాలనం చేశారు. ఈ సమయంలో జరిగిన అంశాన్ని రాహుల్ గాంధీ లేవనెత్తారు.