Sneh Rana: ఏకైక టెస్టులో భారత మహిళా జట్టు ఘన విజయం.. స్నేహ్ రాణా పేరిట అరుదైన రికార్డు..!
- చెపాక్ వేదికగా దక్షిణాఫ్రికా, భారత్ మధ్య టెస్టు మ్యాచ్
- సఫారీ జట్టుపై భారత్ బంపర్ విక్టరీ
- ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్ స్నేహ్ రాణా అరుదైన రికార్డు
- ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లు తీసిన రెండో ఇండియన్ బౌలర్‌గా స్నేహ్ రాణా
చెన్నై చెపాక్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచులో భారత మహిళా జట్టు ఘన విజయం సాధించింది. టీమిండియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 603 పరుగుల భారీ స్కోర్ చేయగా.. సౌతాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 266 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఫాలో ఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్ మొదలెట్టింది. రెండో ఇన్నింగ్స్‌లో 373 రన్స్‌కు ఆలౌటైంది. భారత్ ముందు 37 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఈ టార్గెట్ భారత వికెట్లేమీ కోల్పోకుండా 9.2 ఓవర్లలోనే ఛేదించింది.
ఇక ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్ స్నేహ్ రాణా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టిన రెండో ఇండియన్ బౌలర్‌గా చరిత్ర సృష్టించింది. తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను కుప్పకూల్చిన స్నేహ్ రాణా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ కీలకమైన రెండు వికెట్లు తీసింది. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా ఆమె 10 వికెట్లు తీసింది.
ఆమె కంటే ముందు ఈ జాబితాలో మహిళ క్రికెట్ దిగ్గజం జులాన్ గోస్వామి ఉంది. 2006లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచులో ఆమె 10 వికెట్లు పడగొట్టింది. అయితే, ఈ ఫీట్ సాధించిన తొలి మహిళా స్పిన్నర్ మాత్రం స్నేహ్ రాణానే.
మహిళల టెస్టుల్లో భారత్ తరఫున ఒక మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు
10 -ఝులన్ గోస్వామి vs ఇంగ్లండ్, టౌంటన్ 2006
10 -స్నేహ్ రాణా vs దక్షిణాఫ్రికా, చెన్నై 2024
9 - దీప్తి శర్మ vs ఇంగ్లండ్, ముంబై 2023
9 - హర్మన్‌ప్రీత్ కౌర్ vs దక్షిణాఫ్రికా, మైసూర్ 2014
9 - నీతూ డేవిడ్ vs ఇంగ్లండ్, జంషెడ్పూర్ 1995