Lavu Sri Krishna Devarayalu: ఏపీ సమస్యలపై లోక్ సభలో గట్టిగా గళం వినిపించిన టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
- ఏపీ పునర్ నిర్మాణానికి కేంద్రం తోడ్పాటు అందించాలన్న శ్రీకృష్ణదేవరాయలు
- ఏపీ పునర్ నిర్మాణం అనేది అత్యంత ప్రాధాన్యత అంశం అని వెల్లడి
- గత ఐదేళ్లుగా పోలవరం పడకేసిందని స్పష్టీకరణ
- ఏపీ రాజధాని లేకుండా కొనసాగుతోందని ఆవేదన
టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్ సభలో ఏపీ సమస్యలపై గళం వినిపించారు. ఏపీ పునర్ నిర్మాణం జరుపుకుంటోందని, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర క్యాబినెట్ మరింత సహాయం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఏపీ పునర్ నిర్మాణం అనేది అత్యంత ప్రాధాన్యత అంశం అని లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు.
"ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ఆర్థిక లోటు గురించి గత ఐదేళ్లుగా మేం మాట్లాడుతున్నాం. మా సీనియర్ సహచరులు గత పదేళ్లుగా పోరాడుతున్నారు. ఆర్థిక లోటును భర్తీ చేసేలా నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖను కోరుతున్నాం.
ఇక మరో ముఖ్యాంశం... ఏపీ ఎదుర్కొంటున్న రుణభారం. ఏపీకి ప్రస్తుతం రూ.13.5 లక్షల కోట్ల అప్పు ఉంది. ఇంత అప్పు చేసినా గత ఐదేళ్లలో ఏపీలో ఎలాంటి మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు.
గత ఐదేళ్లుగా పోలవరం ప్రాజెక్టు కూడా పడకేసింది. అయితే ఓ కొత్త బృందాన్ని పంపి పోలవరం ప్రాజెక్టు వద్ద పరిశీలన చేపట్టినందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పోలవరం ప్రాజెక్టు ద్వారా ఏపీలో 4.3 లక్షల హెక్టార్లకు నీరు అందించే వీలుంది. అదే సమయంలో 28.5 లక్షల ఇళ్లకు తాగునీరు అందించవచ్చు. అంతేకాదు, పోలవరం ప్రాజెక్టుతో 960 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లాలని కేంద్రాన్ని కోరుతున్నాం.
ఇక, అమరావతి ఏపీ రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాలను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రభుత్వానికి అప్పగించారు. ఏపీ రాజధాని నిర్మాణం కోసం కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా, ఏపీ ఇప్పటికీ రాజధాని లేకుండా కొనసాగుతోంది.
విశాఖ-చెన్నై ఎకనామిక్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం తోడ్పాటు అందించాలి. ఈ ఎకనామిక్ కారిడార్ తో విశాఖ పోర్టు, కాకినాడ పోర్టు, మచిలీపట్నం పోర్టు, కృష్ణపట్నం పోర్టు అనుసంధానం చేయొచ్చు. ఈ కారిడార్ పూర్తయితే ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తాయి, కొత్త పరిశ్రమలు వస్తాయి. ఈ ఎకనామిక్ కారిడార్ ద్వారా రాష్ట్రానికి తూర్పు ఆసియా దేశాలకు మధ్య అనుసంధానత ఏర్పడుతుంది.
అటు, ఏపీకి రైల్వే ప్రాజెక్టులు, విద్యాసంస్థల ఏర్పాటు-నిర్మాణం తదితర అంశాలలోనూ కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందుతాయని ఆశిస్తున్నాం" అంటూ లావు శ్రీకృష్ణదేవరాయలు తన ప్రసంగంలో పేర్కొన్నారు.