Salman Khan: సల్మాన్ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు

New charge sheet filed in plotting to assassinate Salman Khan case have revealed chilling details
  • రూ.25 లక్షల ఒప్పందం కుదుర్చుకున్న నిందితులు
  • పాకిస్థాన్ నుంచి అత్యాధునిక ఆయుధాలు కొనాలని భావించిన నిందితులు
  • సింగర్ సిద్దూ మూసేవాలా హత్యలో వాడిన టర్కిష్ ‘జిగానా పిస్టల్‌’ కొనుగోలు చేయాలని ప్లాన్
  • హత్య కోసం 18 ఏళ్లలోపు మైనర్ల నియామకం
  • నిఘా కోసం 60-70 మందితో నెట్‌వర్క్ ఏర్పాటు
ఈ ఏడాది ఏప్రిల్ 14న బాంద్రాలోని బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఇంటి వెలుపల కాల్పుల ఘటన కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. కరుడుగట్టిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ ‘సల్మాన్ ఖాన్ హత్యకు పక్కా కుట్ర’ పన్నిందని నవీ ముంబై పోలీసులు తేల్చారు. మొత్తం ఐదుగురు నిందితులపై హత్యకు కుట్ర, ఇతర తీవ్రమైన నేరాలకు సంబంధించిన అభియోగాలను మోపారు. ఈ మేరకు కొత్త ఛార్జిషీట్ దాఖలు చేశారు. రూ.25 లక్షల ఒప్పందం ప్రకారం సల్మాన్‌ను హత్య చేయాలనుకున్నారని, ఆగస్ట్ 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు నెలల పాటు ఈ హత్య ప్రణాళికను రూపొందించారని పోలీసులు పేర్కొన్నారు.

నిందితుల ముఠా ఏకే-47ఎస్, ఏకే-92ఎస్, M16 రైఫిల్స్‌ వంటి అధునాతన మారణాయుధాలను పాకిస్థాన్ నుంచి కొనుగోలు చేయాలని భావించారని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యలో ఉపయోగించిన టర్కీలో తయారయ్యే ‘జిగానా పిస్టల్‌’ను కూడా కొనాలని భావించినట్టు దర్యాప్తులో తేలిందని వివరించారు.

హత్య కుట్రలో భాగంగా సల్మాన్ ఖాన్‌పై భారీ నిఘా పెట్టినట్టు దర్యాప్తులో వెల్లడైంది. సల్మాన్ ఖాన్ ప్రతి కదలికను ట్రాక్ చేసేందుకు దాదాపు 60 నుంచి 70 మంది వ్యక్తుల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నట్టు ఛార్జిషీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. విస్తృతమైన ఈ నిఘా నెట్‌వర్క్ ద్వారా ముంబైలోని సల్మాన్ నివాసం, పన్వెల్‌లో ఉన్న అతడి ఫామ్‌హౌస్, సినిమా షూటింగ్‌కు వెళ్లే గోరేగావ్‌ ఫిల్మ్ సిటీని కూడా కవర్ చేసేలా ఈ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారు.

ఇక హత్య చేసేందుకు 18 ఏళ్ల లోపు బాలురను నియమించుకున్నారని ఛార్జ్ షీట్ పేర్కొంది. నిందిత మైనర్‌లు దాడి చేసేందుకు గ్యాంగులో కీలక వ్యక్తులైన గోల్డీ బ్రార్, అన్మోల్ బిష్ణోయ్ నుంచి ఆదేశాల కోసం ఎదురు చూశారని పోలీసులు వెల్లడించారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్ 14న బాంద్రాలోని సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల మోటార్‌బైక్‌లపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పలు రౌండ్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
Salman Khan
Salman Khan case
Salman Khan assassinate plot
Crime News

More Telugu News