PM Modi: రాహుల్ గాంధీలా చేయకండి.. ఎన్డీఏ ఎంపీలకు మోదీ సలహా
- సభను, సభాపతిని గౌరవించాలని సూచించిన ప్రధాని
- రాహుల్ ప్రసంగం అవమానకరమని ఆరోపణ
- కొత్త సభ్యులు సీనియర్లను అడిగి తెలుసుకోవాలని సూచన
పార్లమెంట్ లో అడుగుపెట్టిన కొత్త సభ్యులు సభా మర్యాదను, గౌరవాన్ని కాపాడాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. నియమనిబంధనల విషయంలో సందేహాలను సీనియర్లను అడిగి నివృత్తి చేసుకోవాలని చెప్పారు. అంతేకానీ రాహుల్ గాంధీలా ప్రవర్తించ వద్దని సూచించారు. మంగళవారం ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. కూటమి సభ్యులతో సభలో ప్రవర్తించాల్సిన విధానాన్ని, చర్చించాల్సిన విషయాలను వివరించారు. లోక్ సభలో సోమవారం రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై స్పందిస్తూ.. సభను, సభాపతిని ప్రతిపక్ష నేత అవమానించారని విమర్శించారు. మూడోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేకపోతోందని మోదీ ఆరోపించారు.
కొత్తగా ఎన్నికైన సభ్యులు నిబంధనల విషయంలో సీనియర్లను అడిగి తెలుసుకోవాలని మోదీ సూచించారు. ఈ సమావేశం వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మీడియాకు వెల్లడించారు. కొన్ని దశాబ్దాల పాటు ప్రధాని కుర్చీని ఓ కుటుంబం తమ గుప్పిట్లో ఉంచుకుందని మోదీ ఆరోపించారన్నారు. అయితే, ఎన్డీఏ కూటమి మాత్రం దేశంలోని నేతలు అందరికీ సమాన గౌరవం ఇస్తుందన్నారు. ప్రతీ ఎంపీ తమ కుటుంబసభ్యులతో కలిసి ప్రధానమంత్రి సంగ్రహాలయ్ సందర్శించాలని చెప్పారు. దేశ తొలిప్రధాని నెహ్రూ నుంచి ఇప్పటి వరకు.. ప్రధానుల ప్రయాణాన్ని అందంగా ప్రదర్శించారని తెలిపారు. వారి జీవిత విశేషాలను మనమంతా తెలుసుకోవాలని ప్రధాని చెప్పారన్నారు. మాట్లాడాలనుకున్న అంశంపై ముందుగానే అధ్యయనం చేయాలని ఎంపీలకు సూచించారని అన్నారు. మీడియా ముందు అనవసర వ్యాఖ్యలు చేయొద్దని మోదీ హెచ్చరిస్తూ.. సొంత నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ చేరువగా ఉండాలని, దేశ సేవకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని మోదీ సూచించినట్లు రిజిజు తెలిపారు.