Revanth Reddy: అతిపెద్ద సమస్య డ్రగ్స్... వీడియో ద్వారా ప్రచారం కల్పించినందుకు చిరంజీవి గారికి థ్యాంక్స్: రేవంత్ రెడ్డి
- చాలామంది విద్యార్థులు గంజాయికి బానిసలవుతున్నారని ఆందోళన
- హత్య, అత్యాచారం కంటే సైబర్ నేరాలు పెద్దవిగా మారాయని వ్యాఖ్య
- పేదలు, మధ్య తరగతివారే సైబర్ నేరాల బారిన పడుతున్నారన్న సీఎం
మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో డ్రగ్స్, సైబర్ నేరాలు ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థులు చాలామంది గంజాయికి బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హత్య, అత్యాచారం కంటే ఈ కాలంలో సైబర్ నేరాలు పెద్దవిగా మారాయన్నారు. హత్య చేస్తే ఒకరో ఇద్దరో చనిపోతారని... కానీ సైబర్ నేరాలతో చాలామంది చిక్కుకుపోతారన్నారు. ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి వారే సైబర్ నేరాల బారిన పడుతున్నారన్నారు. గంజాయి కూడా ప్రమాదకరమైనదన్నారు.
చిరంజీవికి థ్యాంక్స్ చెప్పిన రేవంత్ రెడ్డి
డ్రగ్స్ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చిరంజీవి వీడియో ద్వారా ప్రచారం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. చిరంజీవి గారు డ్రగ్స్ నియంత్రణకు తనంతట తానే ముందుకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు చెప్పారు.
ప్రత్యేక పోలీస్ వాహనాలను ప్రారంభించిన సీఎం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో పోలీసుల ప్రత్యేక వాహనాలను ప్రారంభించారు. టీజీ న్యాబ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాహనాలను ప్రారంభించారు. అనంతరం నార్కోటిక్ బ్యూరో ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. మార్పు మన ప్రభుత్వ బాధ్యత అక్కడి వాల్ బోర్డుపై సీఎం రేవంత్ రెడ్డి రాశారు.