Zika Virus: మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం... పూణేలో ఆరు కేసుల నమోదు
- తాజాగా పూణేలో రెండు కొత్త కేసులు
- పూణే కేసుల్లో ఇద్దరు గర్భవతులు
- గర్భవతులపై జికా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న వైద్యులు
మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం రేగింది. ఒక్క పూణే నగరంలోనే 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జికా వైరస్ బారిన పడిన వారిలో ఇద్దరు గర్భవతులు ఉన్నారు.
పూణేలో మొదట ఓ డాక్టర్ కు, ఆయన టీనేజి కుమార్తెకు జికా వైరస్ పాజిటివ్ గా తేలింది. తాజాగా, ఆ డాక్టర్ కుటుంబం నివసిస్తున్న ప్రాంతంలోనే రెండు కొత్త కేసులు వెలుగు చూశాయి. ఆ ఇద్దరి శాంపిల్స్ ను పరీక్షించగా, జికా వైరస్ నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో, ఇరంద్ వాణే ప్రాంతంలో ఆరోగ్య శాఖ విస్తృతస్థాయిలో శాంపిల్స్ సేకరిస్తోంది.
గర్భవతులకు జికా వైరస్ సోకితే, పర్యవసానాలు ప్రమాదకరంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. పుట్టే శిశువుపై ఈ వైరస్ ప్రభావం తీవ్రస్థాయిలో కనిపిస్తుందని, సాధారణం కంటే చాలా చిన్న తలతో శిశువులు జన్మిస్తుంటారని వివరించారు. శిశువుల్లో పుట్టుకతోనే వచ్చే ఇతర అసాధారణ ఆరోగ్య సమస్యలను కూడా ఈ వైరస్ కలిగిస్తుందని తెలిపారు.
జికా వైరస్ అనేది దోమల కారణంగా వ్యాప్తి చెందుతుంది. ఏడిస్ ఈజిప్టై, ఏడిస్ అల్బోపిక్టస్ అనే రకాల దోమలు జికా వైరస్ వాహకాలుగా పనిచేస్తాయి. జికా వైరస్ ను 1952లో మొట్టమొదటిసారిగా ఉగాండాలో గుర్తించారు.