Kodandaram: అప్పుడు జగన్, కేసీఆర్ తమ అవసరాల కోసమే మాట్లాడుకున్నారు: చంద్రబాబు-రేవంత్ భేటీ కానుండటంపై కోదండరాం
- ఇరువురు సీఎంలు కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావం
- జగన్, కేసీఆర్ రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఏనాడూ చర్చించలేదని విమర్శ
- బీఆర్ఎస్ హయాంలో విభజన హామీలు జటిలమయ్యాయని ఆగ్రహం
ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నెల 6న హైదరాబాద్లో సమావేశం కానున్నారు. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు నిన్న లేఖ రాశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం కానుండటంపై తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం స్పందించారు.
ఇరువురు సీఎంలు కూర్చొని మాట్లాడుకుంటే రాష్ట్రాల సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో జగన్, కేసీఆర్లు తమ తమ రాజకీయ అవసరాల కోసం మాట్లాడుకున్నారు తప్ప... రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఏనాడూ చర్చించలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో విభజన హామీలు జటిలమయ్యాయన్నారు. జల వివాదాలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల విషయంలో ఉన్న సమస్యలు కూడా త్వరగా పరిష్కారమవ్వాలని ఆకాంక్షించారు.