Stumpede: యూపీలో విషాదం... శివారాధాన కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 27 మంది మృతి
- హత్రాస్ జిల్లాలో ఆధ్యాత్మిక కార్యక్రమంపై మృత్యు పంజా
- తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన భక్తులు
- మృతుల్లో 23 మంది మహిళలు, ఒక చిన్నారి
ఉత్తరప్రదేశ్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. హత్రాస్ జిల్లాలోని రతిభాన్పూర్ లో జరిగిన శివారాధన కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 27 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో 23 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. 15 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఎటా ఆసుపత్రికి తరలించారు. కాగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను అప్రమత్తం చేశారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు సీఎం ఆదిత్యనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు.
అంతేకాదు, హత్రాస్ ఘటనపై సమాచారం అందిన వెంటనే సీఎం ఆదిత్యనాథ్ ఇద్దరు మంత్రులను, డీజీపీని సంఘటన స్థలానికి పంపించారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ఆగ్రా అడిషనల్ డీజీపీ, అలీగఢ్ పోలీస్ కమిషనర్ లతో ఓ కమిటీని నియమించారు.