Pawan Kalyan: 9 నెలల కిందట అదృశ్యమైన బాలిక ఆచూకీ లభ్యం... స్వయంగా ఫోన్ చేసి పోలీసులను అభినందించిన పవన్ కల్యాణ్
- ఇటీవల ఓ మహిళ పవన్ ను కలిసి తన కుమార్తె అదృశ్యంపై కన్నీరుపెట్టిన వైనం
- ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసిన పవన్
- వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు
- బాలిక జమ్మూలో ఉన్నట్టు గుర్తింపు
ఇటీవల ఓ మహిళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసి తన కుమార్తె అదృశ్యంపై కన్నీటిపర్యంతమైంది. ఆ విషయాన్ని పవన్ కల్యాణ్ మాచవరం పోలీసులకు తెలియజేశారు. దాంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసును ఛేదించారు. ఆ మైనర్ బాలిక జమ్మూలో ఉన్నట్టు గుర్తించారు.
ఈ విషయాన్ని నేడు కాకినాడ జిల్లా సమీక్ష కార్యక్రమంలో పవన్ కల్యాణ్ స్వయంగా వెల్లడించారు. అంతేకాదు, అప్పటికప్పుడు ఫోన్ చేసి పోలీసులను అభినందించారు. పోలీసు ఉన్నతాధికారితో పవన్ మాట్లాడారు. అందుకు ఆ పోలీసు ఉన్నతాధికారి బదులిచ్చారు.
"ఆ అమ్మాయి పేరు తేజస్విని సర్... 9 నెలల క్రితం మిస్సయింది... మీరు చెప్పిన వెంటనే ఇద్దరు సీఐలతో టీమ్ ఏర్పాటు చేశాం సర్... టెక్నికల్ టీమ్, సైబర్ టీమ్ కూడా ఈ ఆపరేషన్ లో పాలుపంచుకున్నాయి.. కేరళ, బెంగళూరు కూడా వెళ్లి వెతికాం సర్... చివరికి జమ్మూలో ఆ అమ్మాయి ఆచూకీ దొరికింది సర్. ఆ అమ్మాయి సేఫ్ గా ఉంది... అయితే ఇది కిడ్నాప్ కేసు కాదు సర్... పూర్తి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది... ఆ అమ్మాయిని రాష్ట్రానికి తీసుకువస్తున్నాం... తదుపరి దర్యాప్తు వివరాలు త్వరలోనే తెలియజేస్తాం సర్" అని పోలీసు అధికారి పవన్ కు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది.