Stray Dogs Attack: ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు.. అత‌డిని చుట్టుముట్టి దాడి చేసిన వీధి కుక్కలు.. ఇదిగో వీడియో!

Stray Dogs Attack A Boy Who Was Playing In Front Of House in Sangareddy District
  • సంగారెడ్డి జిల్లా శ్రీనగర్‌ కాలనీలో ఘ‌ట‌న‌
  • ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై ఒక్కసారిగా వీధి కుక్కల దాడి
  • బాలుడి కేక‌లు విని పొరుగింటి వ్య‌క్తి రావ‌డంతో పారిపోయిన శున‌కాలు
  • సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ఘ‌ట‌న దృశ్యాలు
తెలంగాణ‌లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా ఒంట‌రిగా క‌నిపిస్తే చాలు.. దాడులు చేస్తూ తీవ్రంగా గాయపరుస్తున్నాయి. ఇక చిన్నారుల ప‌రిస్థితి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికే ప‌లు సంఘ‌ట‌న‌ల‌లో కుక్క‌ల దాడుల కార‌ణంగా ప‌లువురు చిన్నారులు ప్రాణాలొదిలారు కూడా. వీధి కుక్కల దాడులతో చిన్నపిల్లలు, ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. 

తాజాగా ఇదేకోవ‌లో సంగారెడ్డి జిల్లాలో మ‌రో సంఘ‌ట‌న చోటుచేసుకుంది. ఇటీవ‌ల పఠాన్ చెరు మండలంలో కుక్క‌ల‌ దాడిలో ఓ బాలుడు చ‌నిపోయిన సంఘటనను మరువక ముందే ఇప్పుడు మ‌ళ్లీ జిల్లా కేంద్రంలో మరో ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.

వివ‌రాల్లోకి వెళితే.. సంగారెడ్డి పట్టణంలోని 12వ వార్డు శ్రీనగర్‌ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ బాలుడిపై ఒక్కసారిగా ఆరు వీధి కుక్కలు దాడి చేశాయి. బాలుడు వాటి నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేసినా వెంబ‌డించి మ‌రీ క‌రిచాయి. దాంతో బాలుడు గ‌ట్టిగా అరిచాడు. బాలుడి కేకలు విన్న పొరుగింటిలో ఉండే వ్య‌క్తి వెంట‌నే ప‌రిగెత్తుకు వ‌చ్చి కుక్కల‌ను త‌రిమివేశాడు. 

అయితే, అప్ప‌టికే బాలుడిని కింద‌ప‌డేసి వీధి కుక్కలు బాగా ర‌క్కేశాయి. వాటి దాడిలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయ‌ప‌డిన‌ బాలుడిని చికిత్స కోసం ఆసుప‌త్రికి తరలించారు. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన‌ దృశ్యాలు అక్క‌డి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆ వీడియో కాస్తా బ‌య‌ట‌కు రావ‌డంతో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. అధికారులు వెంట‌నే స్పందించి త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నెటిజ‌న్లు కోరుతున్నారు.
Stray Dogs Attack
Sangareddy District
Telangana

More Telugu News