Pawan Kalyan: అసెంబ్లీ గేటు తాకనీయమన్నారు.. గేట్లు బద్దలు కొట్టుకొని వెళ్లాం: పిఠాపురం సభలో పవన్ కల్యాణ్
- పిఠాపురంలో 3 ఎకరాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు వెల్లడి
- కన్నీళ్లు తుడవలేని అధికారం ఎందుకని వ్యాఖ్య
- నేను గెలిపించి ఉండవచ్చు... చంద్రబాబు అనుభవం సుపరిపాలన అందిస్తోందన్న జనసేనాని
- రుషికొండ ప్యాలెస్ నిర్మాణం కోసం రూ.600 కోట్లు అవసరమా? అని నిలదీత
తనను అసెంబ్లీ గేటును కూడా తాకనీయమని కొందరు మాట్లాడారని... కానీ అసెంబ్లీ గేటును తాకడం కాదు... గేట్లు బద్దలు కొట్టుకొని వెళ్లామని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. బుధవారం సాయంత్రం పిఠాపురంలో నిర్వహించిన వారాహి సభలో ఆయన మాట్లాడుతూ... గేటును తాకడం కాదు బద్దలు కొట్టుకొని వెళతామని టీడీపీ నేత వర్మ ముందే చెప్పారన్నారు. అదే నిజమైందన్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్నారు.
తాను పిఠాపురం వాస్తవ్యుడనని ఉపముఖ్యమంత్రి అన్నారు. ఈ ప్రాంతంలో మూడు ఎకరాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని చెప్పారు. విజయవాడ అమ్మాయి అదృశ్యం కేసును తొమ్మిది రోజుల్లో ఛేదించామన్నారు. తొమ్మిది నెలల్లో దొరకని బిడ్డను తొమ్మిది రోజుల్లో గుర్తించామన్నారు. పిఠాపురం ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లో మాట్లాడుకునేలా చేసిందన్నారు. మనం వంద శాతం స్ట్రయిక్ రేట్ సాధించామన్నారు. ఇది మామూలు విషయం కాదన్నారు. ఈ సందర్భంగా ప్రజల ముందు ఆయన మరోసారి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అన్ని వర్గాల వారికీ హామీ ఇస్తున్నానని.. లంచాలు తీసుకోనన్నారు. పవన్ పిఠాపురంలో ఉండడని ప్రచారం చేసేవారికి తాను ఒకటే చెప్పదలుచుకున్నానని.. ఇక్కడ భూమి కొనుగోలు చేశానన్నారు.
కన్నీళ్లు తుడవలేని అధికారం ఎందుకు?
ప్రజల కన్నీరు తుడవలేని అధికారం ఎందుకని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. గ్రామ స్వరాజ్యం కోసం తాను పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నానన్నారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తానన్నారు. అధికారులను బెదిరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
151 సీట్లు ఉన్న వైసీపీని 11కు కుదించారని... ఇది ప్రజాస్వామ్యానికి ఉన్న బలం అన్నారు. ఒక అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు మట్టిలో కలిపేశారన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కూడా అద్భుత విజయం సాధించాం... కానీ ఇలాంటి విజయం రాలేదని టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు అన్నారని తెలిపారు.
నేను గెలిపించి ఉండవచ్చు కానీ చంద్రబాబు మంచి పాలన అందిస్తున్నారు
కూటమి కట్టడానికి తాను ప్రయత్నం చేశానని... విజయానికీ దోహదపడ్డానని... కానీ చంద్రబాబు తన అపారమైన అనుభవంతో మంచి పాలన అందిస్తున్నారని తెలిపారు. 1వ తేదీనే 90 శాతం మంది ఉద్యోగులకు వేతనాలు క్రెడిట్ అయినట్లు చెప్పారు. సరైన నాయకత్వం ఉంటే తక్కువ సమయంలో సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఒక్క విలేజ్ వాలంటీర్ సహాయం లేకుండా మనం పెన్షన్లను అందించామన్నారు. నా వద్ద ఏముంది... చంద్రబాబు వద్ద అపార అనుభవం ఉందన్నారు.
600 కోట్లు అవసరమా?
గత ప్రభుత్వం రుషికొండలో ప్యాలెస్ కట్టడానికి రూ.600 కోట్లు ఖర్చు చేసిందని మండిపడ్డారు. అంత ఖర్చు అవసరమా? అని ప్రశ్నించారు. ఆ ఖర్చుతో నియోజకవర్గాలలోని సమస్యలను పరిష్కరించే అవకాశం ఉండేదన్నారు. కోట్లు సంపాదించే తాను కూడా అలాంటి బాత్రూం కట్టుకోలేదని ఎద్దేవా చేశారు. ఫర్నీచర్ కొందామని... తనకు అధికారులు సూచించారని... కానీ వద్దని వారిని వారించానని పవన్ కల్యాణ్ చెప్పారు. ఒక్క రూపాయి వేస్ట్ చేయవద్దని అధికారులకు సూచించానన్నారు. తాను ఫర్నీచర్ కొనుగోలు చేయకుంటే ఆ మొత్తం ఉద్యోగి వేతనానికి వెళ్తుందన్నారు.