Pawan Kalyan: సమస్యలు తీరుస్తాను... కానీ కాస్త సమయం ఇవ్వండి: పవన్ కల్యాణ్
- కోటగుమ్మం రైల్వే జంక్షన్ బాధ్యతను తాను తీసుకుంటున్నానని వెల్లడి
- ప్రతి హామీ నాకు గుర్తుందన్న పవన్ కల్యాణ్
- పిఠాపురం ప్రజల విజ్ఞప్తులను తీసుకోవడానికి ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు వెల్లడి
- అయిదేళ్లలో అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానన్న పవన్ కల్యాణ్
ఎన్నో సమస్యలను తన దృష్టికి తీసుకు వస్తున్నారని... వాటిని తీరుస్తానని... కానీ కాస్త సమయం ఇవ్వండని జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. అన్ని హామీలను క్రమంగా నెరవేరుస్తామన్నారు. తాగునీరు, సాగు, విద్య, వైద్యం, ఉపాధి హామీలు నెరవేరుస్తున్నట్లు చెప్పారు. రోడ్ల సమస్యలనూ త్వరలో పరిష్కరిస్తామని... కానీ కాస్త సమయం కావాలన్నారు. కోటగుమ్మం రైల్వే జంక్షన్ బాధ్యతను తాను తీసుకుంటున్నానని... ఎవరిని కదిలించాలో చెప్పండి... ఢిల్లీకి వెళ్లి ఎవరితో మాట్లాడాలో చెప్పండి... తీసుకువచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.
ఉద్యోగాలు లేవని... నీళ్లు రాలేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ప్రతి హామీ తనకు గుర్తుందన్నారు. ఉప్పాడ తీరం కోత సమస్యకు పరిష్కారం చూపిస్తూ టూరిజంను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అందమైన కోస్టల్ రోడ్డును నిర్మిస్తామని వెల్లడించారు. పిఠాపురంలో సెరీకల్చర్ (పట్టు పరిశ్రమ)ను అభివృద్ధి చేస్తామని, గొల్లప్రోలులో ఉద్యానపంటల కోసం శీతల గిడ్డంగులు నిర్మిస్తామన్నారు. ఏ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లినా కేంద్రమంత్రులు సానుకూలంగా స్పందిస్తున్నట్లు చెప్పారు.
పిఠాపురం ప్రజల విజ్ఞప్తులను తీసుకోవడానికి తాను ప్రత్యేక సిబ్బందిని నియమించానన్నారు. వారు ఏ వినతులనైనా స్వీకరిస్తారని తెలిపారు. ఉపాధి, వైద్యం, శాంతిభద్రతల సమస్యలను వెంటనే పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. పిఠాపురంలోని శ్రీపాద వల్లభుడి సాక్షిగా చెబుతున్నాను... మీకు రుణపడి ఉంటానని ప్రజలను ఉద్దేశించి అన్నారు. పదవిలో ఉన్నా లేకున్నా తనలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. ఈ అయిదేళ్లలో అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానన్నారు.