Team India: విమానంలో టీమిండియా ప్లేయర్ల సెలబ్రేషన్స్.. రోహిత్‌ను ఎప్పుడూ ఇలా చూసుండరు.. ఇదిగో వీడియో!
- బార్బడోస్ నుంచి ఢిల్లీ చేరుకున్న టీమిండియా
- విమానంలో ట్రోఫీతో ఆటగాళ్ల సెలబ్రేషన్స్ వీడియోను పంచుకున్న బీసీసీఐ
- వీడియోలో కెప్టెన్ రోహిత్ శర్మ ఫన్నీ ఎక్స్ప్రెషన్ హైలైట్
13 ఏళ్ల తర్వాత మళ్లీ ఐసీసీ ట్రోఫీ గెలవడంతో టీమిండియా ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేవు. టీ20 ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన తర్వాత మైదానంలో ఓ రేంజ్లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇక బెరిల్ తుపాను కారణంగా గత శనివారం నుంచి బార్బడోస్‌లోనే చిక్కుకుపోయిన భారత జట్టు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకుంది. ఇవాళ ఉదయం 6 గంటల ప్రాంతంలో ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎయిరిండియా విమానంలో ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు ఇండియాకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ఆటగాళ్లకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
అయితే, విమానంలో టీమిండియా ప్లేయర్లు చేసిన సెలబ్రేషన్స్ తాలూకు వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను బీసీసీఐ తన అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఫన్నీ ఎక్స్ప్రెషన్తో వీడియో మొదలైంది. విమానంలో రోహిత్ చేష్టలు చాలా ఫన్నీగా ఉన్నాయి. ఆ తర్వాత ట్రోఫీతో విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, సూర్యకుమార్ దంపతులు కనిపించారు.
ఈ క్రమంలో పేసర్ మహ్మద్ సిరాజ్ ట్రోఫీని చేతిలో పట్టుకుని మాట్లాడాడు. "చాలా ఆనందంగా ఉంది. ఇది (వరల్డ్‌కప్ ట్రోఫీ) చేతిలోకి రావడానికి చాలా కష్టపడ్డాం. ఎన్నో రోజులు వేచి చూశాం. ఎట్టకేలకు దీన్ని సాధించాం. ఈ ఆనందం మాటల్లో చెప్పలేను" అంటూ సిరాజ్ చెప్పుకొచ్చాడు.
ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, భారత జట్టు సభ్యులు మొదట ప్రధాని మోదీని కలవనున్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో ముంబైకి బయల్దేరుతారు. ముంబైలో విక్టరీ ర్యాలీ తర్వాత వాంఖడే స్టేడియంలో ఆటగాళ్లను బీసీసీఐ ప్రత్యేకంగా సన్మానించనుంది.