Harsh Goenka: 'డంక్డ్ రైస్ కేక్'.. అంటే ఇడ్లీ: హర్ష్ గోయెంకా ట్వీట్ వైరల్
- విదేశాల్లోని రెస్టారెంట్లలో భారతీయ వంటకాల పేర్లపై పారిశ్రామికవేత్త ట్వీట్
- యూఎస్ రెస్టారెంట్ తాలూకు ఫుడ్ మెనూను పంచుకున్న హర్ష్ గోయెంకా
- అందులో నవ్వు తెప్పించేవిగా ఉన్న ఇడ్లీ, వడ, దోశల పేర్లు
- అయితే వాటి ధరలు చూస్తే మాత్రం కళ్లుబైర్లు కమ్మడం ఖాయం
ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా తాజాగా చేసిన ఓ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. విదేశాల్లోని రెస్టారెంట్లలో భారతీయ వంటకాల పేర్లు, వాటి ధరలను చూసి ఆయన అవాక్కయ్యారు. అదే విషయాన్ని ఈ ట్వీట్ ద్వారా హర్ష్ గోయెంకా పంచుకున్నారు.
"ఇడ్లీ, వడ, దోశలు ఇలా ఫ్యాన్సీగా మారుతాయని ఎవరికి తెలుసు? ఇకేంముంది ఖానేకా మజా ఖతం. మీరు అంగీకరిస్తున్నారు కదా" అంటూ ఆయన ఫన్నీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు యూఎస్ రెస్టారెంట్ తాలూకు ఫుడ్ మెనూను జత చేశారు.
ఇక ఆ మెనూలో సాంబార్ వడ పేరును 'డంక్డ్ డోనట్'గా, సాంబార్ ఇడ్లీని 'డంక్డ్ రైస్ కేక్'గా, దోశను 'నేకెడ్ క్రీప్'గా పేర్కొనడం జరిగింది. అయితే, ఈ పేర్లు నవ్వు తెప్పించేవిగా ఉన్నా.. వాటి ధరలు చూస్తే మాత్రం చుక్కలు కనిపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్లేట్ సాంబార్ వడ ధర రూ. 1,300, ఇడ్లీ ధర రూ. 1,200, దోశ ధర రూ. 1,400గా ఉన్నాయి. ఇది చూసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. దీనిపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
"దోశను నేకెడ్ క్రీప్ అని పిలవడం దక్షిణ భారతీయులందరినీ అవమానించడమే" అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. "షేక్స్‌పియర్ ప్రేమికులు.. ఇడ్లీ, వడ, దోశలు ఏ ఇతర పేరుతోనైనా తీపిగా, రుచిగానే ఉంటాయి!" అని మరో నెటిజన్ రాసుకొచ్చారు.