TGPSC: గ్రూప్-1 మెయిన్స్‌పై అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక అప్డేట్
- మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలోనే అభ్యర్థుల ఎంపిక అంటూ స్పష్టీకరణ
- 1:100 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక సాధ్యం కాదని వెల్లడి
- జీఓ నం. 29, 55 మేరకు అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్న టీజీపీఎస్సీ
గ్రూప్-1 మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపికపై టీజీపీఎస్సీ తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది. మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలోనే అభ్యర్థులను ఎంపిక చేస్తామని స్పష్టం చేసింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా మెయిన్స్ పరీక్షకు 1:100 ప్రాతిపదికన ఎంపిక చేయాలని ఉద్యోగార్థులు గతకొన్నిరోజులుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 1:100 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు జీఏడీ జారీ చేసిన జీఓ నం. 29, 55 మేరకు అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని బోర్డు వెల్లడించింది.
ఇదిలాఉంటే.. గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 19న టీజీపీఎస్సీ విడుదల చేసింది. 563 పోస్టులతో గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఈ పోస్టులకు జూన్ 9వ తేదీన ప్రిలిమ్స్ నిర్వహించింది. త్వరలోనే ఈ ఫలితాలు వెలువడనున్నాయి. ఇక అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే టీజీపీఎస్సీ ప్రకటించింది.