Ram Prasad Reddy: పిన్నెల్లిని పరామర్శించుకో... అంతవరకే... మా నాయకుడి జోలికి రావొద్దు: జగన్ కు మంత్రి రాంప్రసాద్ వార్నింగ్
- నేడు నెల్లూరు జైలులో పిన్నెల్లిని పరామర్శించిన జగన్
- ఏపీలో పథకాలు అమలు చేయడంలేదంటూ సీఎం చంద్రబాబుపై విమర్శలు
- అభివృద్ధికి పాతరేసిన నువ్వా మా నాయకుడ్ని విమర్శించేది అంటూ రాంప్రసాద్ ఫైర్
నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నేడు జగన్ పరామర్శించారు. జైలు వెలుపల మీడియాతో మాట్లాడుతూ జగన్ టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి బదులిచ్చారు.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి, పోలింగ్ బూత్ లోకి చొరబడి అక్కడున్న ఈవీఎంను పగులగొట్టిన కేసులో ముద్దాయిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు జగన్ నేడు నెల్లూరు జైలుకు వెళ్లారని వెల్లడించారు. ఈ సందర్భంగా తాను కొన్ని అంశాలను ఎత్తిచూపదలుచుకున్నానని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
"ఇవాళ మీరు మాజీ ముఖ్యమంత్రి హోదాలో నెల్లూరు జైలుకు వెళ్లారు. ఇవాళ జగన్ జైలుకు వెళ్లి పరామర్శించింది వైసీపీ మాజీ ఎమ్మెల్యేని మాత్రమే కాదు... పవిత్రమైన ఎన్నికల వ్యవస్థను ధిక్కరించిన వ్యక్తిని. పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎంను పగులగొట్టడమే కాకుండా, అక్కడే ఉన్న పోలింగ్ ఏజెంట్ శేషగిరిరావుపై పిన్నెల్లి దాడి చేశారు. ఈ విషయాన్ని గత 30 రోజులుగా మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ చూస్తున్నాం.
ఎంతో బలంగా ప్రజల్లోకి వెళ్లిన ఈ విషయాన్ని కూడా తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారు. దాక్కుని, బెయిల్ కోసం హైకోర్టులో ప్రయత్నించి, బెయిల్ రాకపోవడంతో తనంతట తానే లొంగిపోయారు. అలాంటి వ్యక్తిని నువ్వు పరామర్శించావు. అందుకే మేమేమీ విమర్శించడంలేదు. అతడు మంచివాడో, చెడ్డవాడో నాలుగుసార్లు గెలిచాడు, నీ వెంట తిరిగాడు కాబట్టి నువ్వు పరామర్శించడంలో తప్పులేదు.
కానీ నువ్వు ఆ విషయాన్ని వదిలివేసి ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా, టీడీపీ పైనా కొన్ని విమర్శలు చేయడమేంటి? మాచర్ల నియోజకవర్గం గురించి రాష్ట్ర ప్రజలకే కాదు, దేశం మొత్తానికీ తెలుసు... గత ఐదేళ్లుగా నరమేధం జరిగిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మాచర్ల. టీడీపీ కార్యకర్తలపైనా, ప్రజలపైనా నాటి ఎమ్మెల్యే, అతడి సోదరుడు దాష్టీకాలకు పాల్పడ్డారు.
తోట చంద్రయ్య అనే కార్యకర్తను నడిరోడ్డుపై ఏ విధంగా చంపారో అందరికీ తెలుసు. బొండా ఉమ, ఇతర టీడీపీ నేతలు పల్నాడు వస్తే వారిపై దాడి చేశారు. ఎన్టీఆర్ విగ్రహాలు ధ్వంసం చేశారు. ఈ ఐదేళ్లలో మాచర్లలో భయానక ఘటనలు జరగని రోజంటూ లేదు. ఈ దురాఘతాలను ఎంతో ఓర్పుతో భరించిన ప్రజలు ఇవాళ విముక్తులయ్యారు. ఆయనను, ఆయన సోదరుడ్ని తిరస్కరించి భారీ మెజారిటీతో టీడీపీ అభ్యర్థిని గెలిపించారు.
ఎమ్మెల్యేగా ఉన్న అతడు ఈవీఎంను పగులగొట్టడం అందరూ చూశారు. అలాంటి వ్యక్తిని నువ్వు పరామర్శించడానికి వెళ్లావు. అంతవరకు ఉంటే ఫర్వాలేదు... కానీ నువ్వు అక్కడకి వెళ్లి అమ్మఒడి గురించి, ఇంకో విషయం గురించో మాట్లాడడం విడ్డూరంగా ఉంది. మా ప్రభుత్వం ఏర్పడి ఓ 20 రోజులైంది. 21వ రోజుకే ఈ ప్రభుత్వం ఏమీ చేయడంలేదనో, ఈ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనో మాట్లాడుతున్నారు.
జగన్ మోహన్ రెడ్డీ... నువ్వు ఐదేళ్లు సీఎంగా చేశావు. నీకు మనస్సాక్షి అనేది ఉంటే... నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో బయటికి వచ్చి చెప్పాలి. గత ఐదేళ్లలో సంక్షేమ కార్యక్రమాల నెపంతో రాష్ట్ర ఖజానాను లూటీ చేయడం తప్పు నువ్వు చేసిందేమీ లేదు. బటన్ నొక్కుతాను, బటన్ నొక్కుతాను అనడమే తప్ప, నువ్వు ఏ విధమైన అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించలేదు.
అభివృద్ధి విషయంలో నువ్వు, నీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్టే. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో నువ్వు విఫలమయ్యావు. నీ కేసుల భయంతో ఢిల్లీ టూర్లకు వెళ్లావే తప్ప, నిధుల విషయంలో ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. రాష్ట్రంలోని ఖనిజాలను, వనరులను నీవాళ్లకు దోచిపెట్టావు. లిక్కర్ ద్వారా మీ సొంత ఖజానా పెంచుకున్నారు.
మేం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో, రాబోయే రోజుల్లో వాటిని నెరవేర్చేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వెంటనే ఐదు అంశాలపై సంతకం పెట్టారు. నువ్వు ఏనాడైనా ఒక నిరుద్యోగికి ఉద్యోగం ఇచ్చావా?
డిగ్రీ, ఇంజినీరింగ్ చదివిన వాళ్లకు రూ.5 వేల వేతనంతో ఉద్యోగం ఇచ్చి బానిసలుగా మార్చుకున్న ఘనత నీకే సొంతం. ఇంజినీరింగ్ చదివిన వాళ్లను మరెక్కడికీ వెళ్లనివ్వకుండా, రూ.5 వేలతో కట్టిపడేసి మీ పార్టీకి పబ్లిసిటీ కోసం వాళ్లతో ఊడిగం చేయించుకున్నారు. పల్లెల్లో మీరు అభివృద్ధి చేసిందేమీ లేదు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. గత ఐదేళ్లలో రైతులను, వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసిన ఘనత నీకే దక్కుతుంది" అంటూ రాంప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు.