Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల జల్లు కురిపించిన విరాట్ కోహ్లీ

Jasprit Bumrah is a once in a generation bowler says Virat Kohli
  • బుమ్రాను భారత జాతీయ సంపదగా పిలిచే పిటిషన్‌పై సంతకం చేస్తానన్న విరాట్
  • ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతం చేశాడని ప్రశంసల జల్లు
  • మ్యాచ్ చేజారిపోతోందనుకున్న సమయంలో భారత్‌ను బుమ్రా రేసులోకి తీసుకొచ్చాడని పొగడ్తలు
భారత్ టీ20 ప్రపంచ కప్ 2024‌ను గెలవడంలో అద్భుతమైన బౌలింగ్‌తో కీలక పాత్ర పోషించిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చివరి 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన స్థితిలో బుమ్రా చేసిన మ్యాజిక్‌పై పొగడ్తలతో ముంచెత్తాడు.

బుమ్రాను 8వ ప్రపంచ వింతగా, భారత జాతీయ సంపదగా పిలిచే ఒక పిటిషన్‌ ఏదైనా తీసుకొస్తే సంతకం చేస్తారా అని ప్రశ్నించగా.. తప్పకుండా చేస్తానంటూ క్షణం కూడా ఆలోచించకుండా విరాట్ కోహ్లీ సమాధానం ఇచ్చాడు. గురువారం రాత్రి ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరిగిన టీమిండియా ఆటగాళ్ల సన్మాన కార్యక్రమంలో విరాట్ కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా అద్భుతమైన బౌలర్ అని ప్రశంసించాడు.

‘‘ అభిమానులు అందరిలాగానే మేము కూడా ఒకానొక సమయంలో మ్యాచ్ చేజారిపోతోందని భావించాం. కానీ ఆ చివరి ఐదు ఓవర్లలో జరిగింది నిజంగా ఎంతో ప్రత్యేకమైంది. అవసరమైనప్పుడల్లా మమ్మల్ని మళ్లీ మళ్లీ మ్యాచ్‌ రేసులోకి తీసుకువచ్చిన వ్యక్తి బుమ్రాని అందరూ అభినందించాలని నేను కోరుకుంటున్నాను. ఆ చివరి ఐదు ఓవర్లలో బుమ్రా ఏం చేశాడో మీకు కూడా తెలుసు. చివరి ఐదు ఓవర్లలో 2 ఓవర్లు వేసిన ఆ ఆటగాడిని మీరంతా (స్టేడియంలోని ఫ్యాన్స్) అభినందించాలి’’ అని బుమ్రా పేర్కొన్నారు.

ఇక భారత ఆటగాళ్ల విజయోత్సవ పరేడ్‌కు, సన్మాన కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన అభిమానులకు కోహ్లీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. పరేడ్ సందర్భంగా ముంబై వీధుల్లో చూసిన దృశ్యాలను తన జీవితంలో ఎప్పటికీ మరచిపోలేనని వ్యాఖ్యానించాడు.

కాగా టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు చివరి 30 బంతుల్లో 30 పరుగులు అవసరమైన దశలో బుమ్రా అద్భుతం చేశాడు. 2 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక కీలకమైన వికెట్‌ తీసిన విషయం తెలిసిందే.
Jasprit Bumrah
Virat Kohli
T20 World Cup 2024
Team India

More Telugu News