Rishi Sunak: ఐ యామ్ సారీ.. ఓటమి తరువాత రిషి సునాక్ తీవ్ర భావోద్వేగం
- అధికార కన్జర్వేటివ్ పార్టీ ఓటమికి తనదే బాధ్యత అన్న రిషి సునాక్
- తనను క్షమించాలంటూ మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగం
- ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్కు శుభాకాంక్షలు తెలిపిన రిషి సునాక్
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓటమికి తనదే బాధ్యత అంటూ బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ భావోద్వేగానికి లోనయ్యారు. ఐ యామ్ సారీ అంటూ పార్టీ మద్దతుదారులు, అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. సర్ కీర్ స్టార్మర్కు నేను కాల్ చేసి శుభాకాంక్షలు తెలిపాను. నేడు శాంతియుతంగా, క్రమపద్ధతిలో అధికార మార్పడి జరుగుతోంది. ఇరు పక్షాలు తమపై ఉన్న విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాయి. దేశ భవిష్యత్తుకు, సుస్థిరతకు ఇదే భరోసా’’ అని రిషి సునాక్ నార్తర్న్ ఆల్టెర్టన్లో తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు.
తాజాగా ఎన్నికల్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ 300 పైచిలుకు సీట్లు గెలుచుకుంటే సునాక్ నేతృత్వంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ కేవలం 61 సీట్లలోనే ఆధిపత్యం ప్రదర్శించింది. దీంతో, ఓటమిని అంగికరిస్తూ సునాక్ కీలక ప్రకటన చేశారు.
ఇక కొత్త ప్రభుత్వానికి పలు సవాళ్లు సిద్ధంగా ఉన్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. దిగజారుతున్న ఆర్థికరంగం, పౌరసేవల్లో తీవ్రలోపాలు, నానాటికీ దిగజారుతున్న జీవన ప్రమాణాలు వంటి సమస్యలను పరిష్కరించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇవే అంశాలు కన్జర్వేటివ్ పార్టీ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోవడానికి కారణాలని హెచ్చరిస్తున్నారు.