NEET PG: నీట్–పీజీ ఎంట్రన్స్ కొత్త తేదీ విడుదల

New NEET PG Exam Dates Announced 2 Weeks After They Were Postponed

  • ఆగస్టు 11న ప్రవేశపరీక్ష నిర్వహణకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నిర్ణయం
  • వాస్తవానికి జూన్ 22న పరీక్ష జరగాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా
  • నీట్–యూజీ ఎంట్రన్స్ లో పేపర్ లీకేజీ జరిగిందన్న ఆరోపణలతో ముందుజాగ్రత్తగా వాయిదా వేసిన కేంద్రం

పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్–పీజీ ప్రవేశపరీక్ష కొత్త తేదీలు విడుదలయ్యాయి. ఈ ప్రవేశ పరీక్షను ఆగస్టు 11న నిర్వహించాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్ బీఈ) నిర్ణయించింది. రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది.

వాస్తవానికి జూన్ 22నే నీట్–పీజీ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే పరీక్ష ప్రారంభానికి కొన్ని గంటల ముందు కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా ఎంట్రన్స్ ను వాయిదా వేసింది. ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్–యూజీ ఎంట్రన్స్ లో అక్రమాలు, పేపర్ లీకేజీలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో నీట్–పీజీ ఎంట్రన్స్ ను వాయిదా వేయాలని కేంద్రం నిర్ణయించింది.

పరీక్ష వాయిదాకుగల కారణాలను ఎన్ బీఈ ప్రెసిడెంట్ డాక్టర్ అభిజత్ సేఠ్ వివరించారు. పరీక్ష ఏర్పాట్ల సన్నద్ధతలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా చూసేందుకు, ఈ ప్రక్రియలో లీకేజీల వంటి వాటికి ఆస్కారం ఉండవన్న భరోసా కల్పించాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ భావించిందని చెప్పారు. అందుకే పరీక్షను వాయిదా వేశామన్నారు.

నీట్–పీజీ పరీక్షను ఏడేళ్లుగా ఎన్ బీఈ నిర్వహిస్తోందని.. సంస్థ అనుసరించే కఠిన నిబంధనల వల్ల ఇప్పటివరకు పేపర్ లీకేజీల వంటివి జరగలేదని డాక్టర్ సేఠ్ చెప్పారు.

దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని పీజీ కోర్సుల్లో చేరాలనుకొనే ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించేందుకు నీట్–పీజీ నిర్వహిస్తారు.

నీట్–యూజీ పరీక్ష పేపర్ లేకేజీతోపాటు యూజీసీ–నెట్ పరీక్షను రద్దు చేయడంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. నీట్–యూజీ పరీక్షను రద్దు చేయొద్దంటూ తాజాగా గురువారం గుజరాత్ కు చెందిన 50 మంది విద్యార్థులు సుప్రీంకోర్టుకెక్కారు. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీఏ), కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

ఇప్పటికే ఈ వ్యవహారంపై దాఖలైన 26 పిటిషన్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం ముందు విచారణకు రానున్నాయి. పిటిషనర్లలో కొందరు పరీక్షను మళ్లీ నిర్వహించాలని కోరగా మరికొందరు మాత్రం పరీక్షల్లో అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని కోరారు.

మే 5న నీట్–యూజీ ప్రవేశపరీక్ష నిర్వహించగా ఎన్ టీఏ చరిత్రలోనే తొలిసారిగా పరీక్ష ఫలితాల్లో ఏకంగా 67 మంది విద్యార్థులు 720కిగాను 720 స్కోర్ సాధించడం పలు అనుమానాలకు తావిచ్చింది. పరీక్ష ఆలస్యంగా ప్రారంభమైన పలు సెంటర్లలోని విద్యార్థులకు ఎన్ టీఏ 5 మార్కుల చొప్పున గ్రేస్ మార్కులు కలపడం వల్లే టాపర్ల సంఖ్య అనూహ్యంగా 67కు చేరిందన్న ఆరోపణలు వెల్లువెత్తడం తెలిసిందే.


  • Loading...

More Telugu News