Andhra Pradesh: కాపురానికి రాకుండా భార్య వేధింపులు.. భర్త ఆత్మహత్య!

Husband ends self after wife refuses to return

  • పాత గుంతకల్లు పట్టణంలో ఘటన 
  • ఆస్తి రాయించుకున్నాక కూడా కాపురానికి రాకుండా భార్య వేధింపులు
  • కుమారుడు మరణించాక పుట్టింటికి వెళ్లిపోయిన వైనం, చివరకు లీగల్ నోటీసులు
  • భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య
  • న్యాయం కోసం కుటుంబసభ్యులు రోడ్డుపై బైఠాయింపు

కాపురానికి రాకుండా వేధిస్తున్న భార్యతో పడలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలో చోటుచేసుకుంది. మృతుడిని పాత గుంతకల్లు పట్టణానికి చెందిన లోహిత్‌కుమార్‌గా (24) గుర్తించారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం, పాత గుంతకల్లు పట్టణానికి చెందిన లోహిత్ కుమార్‌కు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన లక్ష్మీదేవితో వివాహం జరిగింది. లక్ష్మీదేవి తరచూ పుట్టింటికి వెళ్లేది. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. 

ఈ విషయమై పలు మార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగాయి. ఆస్తి రాసి ఇస్తే కాపురానికి వస్తానని చెప్పడంతో కోడలి పేరిట 10 సెంట్లు, మనవడి పేరుతో మరో 10 సెంట్ల స్థలం రాసి ఇచ్చామని మృతుడి తండ్రి క్రిష్టప్ప చెబుతున్నారు. ఇటీవల మనవడు చనిపోవడంతో కోడలు పుట్టింటికి వెళ్లిపోయిందని అన్నారు. పోలీస్ స్టేషన్‌లో జరిగిన పంచాయితీలో కాపురానికి వస్తానని చెప్పి రాకుండా భర్తకు ఫోన్ చేసి వేధింపులకు గురి చేసిందన్నారు. తాజాగా లీగల్ నోటీసు పంపించడంతో ఆ బాధ భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో లోహిత్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి, బంధువులు ఆరోపించారు. 

లోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో అతడి కుటుంబసభ్యులు, బంధువులు శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట రహదారిపై బైఠాయించారు. భార్య వేధింపులతోనే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని, కోడలిని రప్పించాలని డిమాండ్ చేశారు. ఆస్తి, డబ్బులు వెనక్కి ఇప్పించాలని, అప్పటివరకూ శవ పరీక్షలు చేయడానికి వీల్లేదని భీష్మించారు. న్యాయం చేస్తామని పోలీసులు భరోసా ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News