Bihar: పాము కాటేసిందని దానినే కొరికేశాడు.. పాము చచ్చింది.. అతను బతికాడు!
- బీహార్ లోని నవాడా జిల్లాలో విచిత్ర ఘటన
- పామును కొరికితే దాని విషం తిరిగి పాములోకి వెళ్లిపోతుందన్న మూఢనమ్మకంతోనే కొరికినట్లు వెల్లడి
- సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో కోలుకున్న బాధితుడు
సాధారణంగా పాముకాటుకు గురైన వారు భయపడిపోతారు.. ప్రాణభయంతో వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి పరుగుతీస్తారు. కానీ బీహార్ లోని నవాడా జిల్లాలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని పాము కాటేయగా అతను ఏమాత్రం భయపడలేదు సరికదా.. తిరిగి దాన్ని పట్టుకొని గట్టిగా కొరికేశాడు. అది కూడా ఒకసారి కాదు.. ఏకంగా రెండుసార్లు! ఇంకేముంది.. మనోడి కొరుకుడు శక్తికి తట్టుకోలేక పాము పుటుక్కున చావగా అతను మాత్రం బతికిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడంతో కోలుకున్నాడు.
అసలు ఏం జరిగిందంటే.. ఝార్ఖండ్ కు చెందిన సంతోష్ లోహర్ అనే 35 ఏళ్ల యువకుడు రైల్వే కార్మికుడు. బీహార్ లోని నవాడా జిల్లా రాజౌలీ పరిధిలో ఉన్న ఓ అడవి మధ్యన జరుగుతున్న రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల్లో సహచరులతో కలిసి పనిచేస్తున్నాడు. గత మంగళవారం రాత్రి పని ముగించుకొని నిద్రపోయేందుకు సిద్ధమవుతుండగా ఓ పాము ఉన్నట్టుండి వచ్చి అతన్ని చటుక్కున కాటేసింది.
దీంతో లోహర్ వెంటనే పామును పట్టుకొని రెండుసార్లు కొరకగా అది చచ్చిపోయింది. మరోవైపు ఈ విషయం తెలియగానే అధికారులు వెంటనే లోహర్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రాత్రంతా చికిత్స పొందిన అనంతరం మర్నాడు ఉదయానికి అతను కోలుకున్నాడు.
ఇలా ఎందుకు చేశావని అడిగితే తన గ్రామంలో ఉన్న మూఢనమ్మకం గురించి లోహర్ చెప్పుకొచ్చాడు. పామును రెండుసార్లు కొరికితే అది కాటేయడం వల్ల మనిషి శరీరంలోకి చేరే విషం తిరిగి పాములోకి వెళ్లిపోతుందని నమ్మి అలా చేశానన్నాడు.
అయితే ఏ రకమైన పాము అతన్ని కాటేసిందో మాత్రం తెలియరాలేదు. కానీ స్థానికులు మాత్రం ఆ పాము విషపూరితమైనది అయ్యుండదని భావిస్తున్నారు. ఒకవేళ విషపూరితమైన పాము కాటేసి ఉంటే లోహర్ పరిస్థితి ప్రమాదంలో పడేదని అంటున్నారు. దేశంలో ఏటా పాముకాట్లకు సుమారు 50 వేల మంది బాధితులు మరణిస్తున్నారు.