TGNPDCL: తెలంగాణలో క్యూఆర్ కోడ్‌తో కరెంట్ బిల్లు చెల్లింపులు.. ఈజీగా బిల్లులు చెల్లించే దిశగా అడుగులు!
- ఆర్‌బీఐ కొత్త రూల్స్.. తెలంగాణలో థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కరెంటు బిల్లుల చెల్లింపు నిలిపివేత
- దీంతో కరెంటు బిల్లుల చెల్లింపు కోసం వినియోగదారుల అవస్థలు
- ఈ నేపథ్యంలో బిల్లుల చెల్లింపు కోసం కొత్తగా క్యూఆర్ కోడ్ విధానం వైపు ప్రభుత్వం మొగ్గు
- టీజీఎస్‌పీసీఎల్ ఈ క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు
ఇటీవల థర్డ్ పార్టీ పేమెంట్ యాప్‌లైన ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం తదితర యాప్‌ల ద్వారా కరెంటు బిల్లుల చెల్లింపును తెలంగాణ ప్రభుత్వం నిలిపి వేసిన విషయం తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త రూల్స్ కారణంగా కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కరెంటు బిల్లులు చెల్లించే సదుపాయం నిలిపివేయబడింది. దీంతో వినియోగదారులు కరెంటు బిల్లుల చెల్లింపు కోసం మీ సేవ కేంద్రాలు, కరెంటు ఆఫీసులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో ప్రజల అవస్థలను గమనించిన ప్రభుత్వం కరెంటు బిల్లుల చెల్లింపు కోసం కొత్తగా క్యూఆర్ కోడ్ విధానం తీసుకువస్తోంది. ఆగస్ట్ నుంచి వినియోగదారులకు జారీ చేసే కరెంటు బిల్లులపై క్యూఆర్ కోడ్‌ను ముద్రించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్‌పీసీఎల్) ఈ క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వినియోగదారులు ఆ కోడ్‌ని స్కాన్ చేసి సులువుగా కరెంటు బిల్లు చెల్లించుకోవచ్చు.
బిల్లు కింద వచ్చే క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి మనకు నచ్చిన పేమెంట్ యాప్ ద్వారా కరెంటు బిల్లును చెల్లించవచ్చు. వినియోగదారులు తమ మొబైల్స్ ద్వారా క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి డెబిట్, క్రెడిట్ కార్డులు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ తదితర విధానాల్లో బిల్లులను చెల్లించే వెసులుబాటు ఉంటుంది. ఇక ఇప్పటికే ఎన్‌పీడీసీఎల్ ఈ క్యూఆర్ కోడ్ విధానాన్ని పైలెట్ ప్రాజెక్టుగా కొన్ని చోట్ల అమలు చేస్తోంది. సంస్థ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా బిల్లుల చెల్లింపుల కంటే ఈ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు సులభతరం కానుంది.