T20 World Cup 2024: ఫైనల్ మ్యాచ్‌లో సూర్య ఆ క్యాచ్ పట్టుకోకుంటే ఏం చేసేవారు? అన్న ప్రశ్నకు రోహిత్ సమాధానం ఇదే!

Rohit Sharma made interesting comments on Suryakumar Yadavs T20 World cup 2024 Final match catch
  • ఆ క్యాచ్‌ను వదిలేసి ఉంటే జట్టు నుంచి తప్పించేవాడినంటూ చమత్కరించిన రోహిత్
  • హిట్‌మ్యాన్ వ్యాఖ్యలతో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే సహా అంతా నవ్వులు
  • రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, జైస్వాల్‌లను ప్రత్యేకంగా సత్కరించిన మహారాష్ట్ర ప్రభుత్వం
టీ20 వరల్డ్ కప్‌-2024 ఫైనల్ మ్యాచ్‌లో పటిష్ఠమైన స్థితిలో ఉన్న దక్షిణాఫ్రికాను ఓడించడంలో సూర్యకుమార్ యాదవ్ పట్టిన డేవిడ్ మిల్లర్ క్యాచ్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పిన ఈ క్యాచ్‌ను అందుకునేందుకు సూర్యకుమార్ యాదవ్ ఒక సూపర్‌మ్యాన్‌లా ఫీట్ చేశాడు. లాంగ్-ఆఫ్‌లో బౌండరీ లైన్‌కు వెంట్రుకవాసిలో క్యాచ్ అందుకున్న ‘మిస్టర్ 360’ బ్యాలెన్స్‌ను నియంత్రించుకోలేక రోప్ అవతలకి వెళ్లాడు. అయితే ఈలోగానే బంతిని గాల్లోకి ఎగరేసి మళ్లీ తిరిగి వచ్చి అందుకున్నాడు. ఇంతటి అద్భుతమైన క్యాచ్‌ పట్టిన సూర్యపై సహచర ఆటగాళ్లు, భారత అభిమానులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు సైతం ప్రశంసల జల్లు కురిపించారు.

మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పిన ఈ క్యాచ్‌ను సూర్యకుమార్ యాదవ్ పట్టలేకపోయుంటే ఏం చేసేవారని ప్రశ్నించగా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. ఆ క్యాచ్‌ను సూర్య వదిలేసి ఉంటే అతడిని తాను జట్టు నుంచి వదిలేసేవాడినని సరదా వ్యాఖ్యలు చేశాడు. క్యాచ్‌ను బాగానే పట్టినట్టు సూర్య తనతో చెప్పాడని హిట్‌మ్యాన్ వెల్లడించారు. తమ రాష్ట్ర ఆటగాళ్లైన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్‌లను మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రత్యేకంగా సత్కరించింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమ వేదికపై రోహిత్ ఈ సరదా వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ వ్యాఖ్యలు విన్న మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేతో పాటు వేదిక మీద రాజకీయ, క్రీడా ప్రముఖులు, కార్యక్రమానికి హాజరైన జర్నలిస్టులు అందరూ నవ్వేశారు. 
T20 World Cup 2024
Rohit Sharma
Suryakumar Yadav Catch
Cricket

More Telugu News