Horned Frog: అరుణాచల్ ప్రదేశ్లో కొమ్ము కప్ప.. కొత్త జాతిని కనుగొన్న శాస్త్రవేత్తలు
- గతంలో దీనిని మావోసన్ కొమ్ముకప్పగా పొరపాటున గుర్తించిన శాస్త్రవేత్తలు
- ఇప్పుడు దీనిని ప్రత్యేక జాతిగా గుర్తించిన వైనం
- హెర్పటోఫౌనల్ వైవిధ్యాన్ని గణనీయంగా పెంచుతుందన్న శాస్త్రవేత్తలు
ఈశాన్య భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్లో శాస్త్రవేత్తలు సరికొత్త కొమ్ముకప్ప జాతిని గుర్తించారు. గతంలో దీనిని మావోసన్ కొమ్ముకప్ప (జెనోఫ్రిస్ మావోసొనెన్సిస్)గా తప్పుగా గుర్తించారు. తాజాగా దీనిని ప్రత్యేక జాతిగా పేర్కొన్నారు. ముదురు గోధుమరంగుతో చిన్న కొమ్ములతో ఉండే ఈ కప్ప తేయాకు ఆకుల మధ్య నివసిస్తుంది. దీనిని జెనోఫ్రిస్ అపటాని హార్న్డ్ ఫ్రాగ్గా చెబుతున్నారు.
ఈ కొత్త జాతిని గుర్తించిన షిల్లాంగ్, పూణేలోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జడ్ఎస్ఐ), పూణె పరిశోధకులు మాట్లాడుతూ ఈ సరికొత్త ఆవిష్కరణ దేశంలోని హెర్పటోఫౌనల్ (ఉభయచరాలు, సరీసృపాల జీవుల సమూహం) వైవిధ్యాన్ని గణనీయంగా పెంచుతుందని పేర్కొన్నారు. కాగా, తాజాగా గుర్తించిన కొమ్ముకప్పను పోలి ఉండే మావోసన్ కొమ్ముకప్పలు వియత్నాం, చైనాలో ఎక్కువగా కనిపిస్తాయి.