HIV: త్రిపురలో హెచ్ఐవీ కలకలం.. 47 మంది విద్యార్థుల మృతి!
- మరో 828 మంది విద్యార్థులకు హెచ్ఐవీ పాజిటివ్
- ప్రతిరోజూ 5 నుంచి 7 కొత్త కేసులు నమోదవుతున్నాయన్న టీఎస్ఏసీఎస్
- ప్రస్తుతం రాష్ట్రంలో హెచ్ఐవీతో బాధపడుతున్నవారి సంఖ్య 5,674
- హెచ్ఐవీ కేసుల పెరుగుదలకు మాదకద్రవ్యాల దుర్వినియోగమే కారణమని వెల్లడి
త్రిపురలో హెచ్ఐవీ కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 47 మంది విద్యార్థులు హెచ్ఐవీ బారినపడి మృతిచెందారు. మరో 828 మంది విద్యార్థులకు హెచ్ఐవీ పాజిటివ్‌గా గుర్తించినట్లు త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (టీఎస్ఏసీఎస్) సీనియర్ అధికారి భట్టాచార్జీ తెలిపారు.
ప్రతిరోజూ 5 నుంచి 7 కొత్త కేసులు నమోదవుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తంగా హెచ్ఐవీతో బాధపడుతున్నవారి సంఖ్య 5,674గా ఉందన్నారు. వీరిలో 4,570 మంది పురుషులు, 1,103 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నట్లు వెల్లడించారు. సంపన్న కుటుంబాల విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారని తెలిపారు.
ఇక హెచ్ఐవీ కేసుల పెరుగుదలకు మాదకద్రవ్యాల దుర్వినియోగమే కారణమని చెప్పారు. సంపన్న కుటుంబాల తల్లిదండ్రులు తమ పిల్లలు మాదకద్రవ్య వ్యసనానికి గురయ్యారని గ్రహించే సమయానికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుందని భట్టాచార్జీ వివరించారు.
త్రిపుర జర్నలిస్ట్ యూనియన్, వెబ్ మీడియా ఫోరమ్, టీఎస్ఏసీఎస్ ఇటీవల సంయుక్తంగా నిర్వహించిన మీడియా వర్క్‌షాప్‌లో ఈ పెరుగుతున్న సంక్షోభం వెనుక ఉన్న వాస్తవాలను తెరపైకి తెచ్చారు.