Krunal Pandya: హార్దిక్ కూడా మనిషేనని మర్చిపోయాం.. ఆయనకూ ఎమోషన్స్ ఉంటాయి: కృనాల్ పాండ్యా భావోద్వేగ పోస్ట్
- టీ20 వరల్డ్‌కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా
- టీ20 ప్రపంచకప్ విజేత జట్టులో హార్దిక్ సభ్యుడు కావడంపై కృనాల్ హర్షం
- 2024 ఐపీఎల్ సందర్భంగా హార్దిక్‌పై ఎదురైన వ్యతిరేకత పట్ల ఆవేదన
- ఇప్పుడు సాధించిన దానికి హార్దిక్ పూర్తిగా అర్హుడంటూ ఎమోషనల్ పోస్ట్
భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టీ20 ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆల్‌రౌండర్ ప్రదర్శనతో హార్దిక్ అదరగొట్టాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో కీలకమైన క్లాసెన్ వికెట్ తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఇక ఆఖరి ఓవర్లో దూకుడు మీద ఉన్న మిల్లర్ వికెట్ పడగొట్టి మ్యాచ్ మొత్తాన్ని టీమిండియా గుప్పిట్లోకి తెచ్చాడు.
ఇలా టీ20 ప్రపంచకప్ గెలుపులో తన సోదరుడు కీలక పాత్ర పోషించడం పట్ల కృనాల్ పాండ్యా భావోద్వేగానికి గురయ్యాడు. టీ20 వరల్డ్‌కప్ విజేత జట్టులో హార్దిక్ సభ్యుడు కావడంపై కృనాల్ సంతోషం వ్యక్తం చేశాడు.
ఇక 2024 ఐపీఎల్ సందర్భంగా హార్దిక్‌పై ఎదురైన వ్యతిరేకత పట్ల అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. రోహిత్ స్థానంలో ముంబై ఇండియన్ కెప్టెన్ అయినప్పుడు హార్దిక్‌ను అందరూ ఎగతాళి చేయడంతో పాటు ఎన్నో మాటలు అన్నారని గుర్తు చేశాడు. హార్దిక్ కూడా మనిషే అని అతడికి కూడా ఎమోషన్స్ ఉంటాయని అందరూ మర్చిపోయారని కృనాల్ చెప్పుకొచ్చాడు.
"నేను, హార్దిక్ పదేళ్లుగా ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నాం. గత కొన్ని రోజుల్లో జరిగింది చూస్తే మా కలలు నెరవేరినట్లయింది. నా సోదరుడు సాధించిన దాన్ని చూసి నేను భావోద్వేగానికి గురయ్యాను. గత ఆరు నెలలు అతడికి చాలా కష్టంగా గడిచాయి. జనాలు అతడిని ఎగతాళి చేయడమే కాకుండా తిట్టారు కూడా. అతడు కూడా అందరిలాగే భావోద్వేగాలు కలిగిన మనిషే అనే విషయాన్ని అందరూ మరిచిపోయారు.
హార్దిక్ ఎప్పుడూ జాతీయ జట్టుకే ప్రాధాన్యం ఇస్తాడు. బరోడా నుంచి వచ్చిన ఆటగాడికి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించడం కంటే పెద్ద విషయం మరొకటి లేదు. ఇప్పుడు సాధించిన దానికి హార్దిక్ పూర్తిగా అర్హుడు" అంటూ హార్దిక్ చిన్ననాటి ఫొటోలతో పాటు ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూస్తూ కంటతడిపెట్టుకున్న వీడియోను కృనాల్ పాండ్యా అభిమానులతో పంచుకున్నాడు. కృనాల్ చేసిన ఈ ఇన్‌స్టా పోస్టు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.