Uttarakhand: ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి ఇద్దరు తెలుగు యాత్రికుల మృతి!
- ఉత్తరాఖండ్లో కుండపోత వర్షాలకు పలు ప్రాంతాల్లో విరిగిపడుతున్న కొండచరియలు
- చమోలీ జిల్లాలో కొండచరియలు విరిగిపడి.. హైదరాబాద్కు చెందిన ఇద్దరు యాత్రికుల మృతి
- మృతులను నిర్మల్ షాహీ, సత్యనారాయణగా గుర్తించిన పోలీసులు
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వర్షాలకు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా చమోలీ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో హైదరాబాద్కు చెందిన ఇద్దరు యాత్రికులు మృత్యువాత పడ్డారు.
మృతులను నిర్మల్ షాహీ (36), సత్యనారాయణ (50) గా అక్కడి పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకుని ద్విచక్రవాహనంపై తిరిగి వస్తున్న సమయంలో మార్గమధ్యంలో కొండచరియలు వారిపై విరిగి పడ్డాయి. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కర్ణప్రయాగ, గౌచర్ మధ్యలోని బద్రీనాథ్ నేషనల్ హైవేపై శనివారం ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
కాగా, భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్ వ్యాప్తంగా ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. రుద్రప్రయాగ్-కేదార్నాథ్ జాతీయ రహదారిపై కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇవాళ, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే రుద్రప్రయాగ్లో ముందు జాగ్రత్త చర్యగా అన్ని పాఠశాలలకు శనివారం సెలవు ఇచ్చేశారు.