Botsa Satyanarayana: తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీని ప్రత్యక్ష ప్రసారం చేయాలి: బొత్స
- రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు
- తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు
- నేడు హైదరాబాదులో సమావేశం కానున్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు కాగా, ఇప్పటికీ అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరిన నేపథ్యంలో, నేడు ముఖ్యమంత్రుల కీలక సమావేశం జరగనుంది. హైదరాబాద్ లో ఈ సాయంత్రం 6 గంటలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమావేశం కానున్నారు.
దీనిపై ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. విభజన సమస్యల పరిష్కారానికి ఇవాళ రెండు రాష్ట్రాల సీఎంలు సమావేశం కానున్న నేపథ్యంలో... పోర్టుల్లోనూ, టీటీడీ ఆస్తుల్లోనూ తెలంగాణ ప్రభుత్వం వాటాలు కోరుతున్నట్టుగా వస్తున్న వార్తలు ఏపీ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయని బొత్స తెలిపారు.
అందుకే, పారదర్శకత కోసం, ప్రజలకు వాస్తవాలు తెలియడానికి వీలుగా ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తే బాగుంటుందని సూచించారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటారని భావిస్తున్నానని బొత్స ట్వీట్ చేశారు.