Malvi Malhotra: రాజ్ తరుణ్ వ్యవహారంలో లావణ్య ఆరోపణలపై మాల్వీ మల్హోత్రా స్పందన

Malvi Malhotra reacts on Lavanya allegations over Raj Tarun issue
  • రాజ్ తరుణ్ వ్యవహారంలో నిన్న సంచలన ఆరోపణలు చేసిన లావణ్య
  • హీరోయిన్ మాల్వీ మల్హోత్రా తమ మధ్య చిచ్చుపెట్టిందని వెల్లడి
  • తనను చంపేస్తామని మాల్వీ, ఆమె సోదరుడు బెదిరించారని ఆరోపణ
  • లావణ్య ఆరోపణల్లో నిజం లేదన్న మాల్వీ
  • తన కుటుంబం హిమాచల్ ప్రదేశ్ లో నివసిస్తోందని వివరణ
హీరో రాజ్ తరుణ్ ను తన నుంచి దూరం చేసింది హీరోయిన్ మాల్వీ మల్హోత్రానే అని లావణ్య అనే యువతి సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ మేరకు లావణ్య నిన్న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్ తరుణ్ ను వదిలేయకపోతే చంపేస్తామని మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు తనను బెదిరించారని లావణ్య ఆరోపించింది. 

దీనిపై మాల్వీ మల్హోత్రా స్పందించారు. ఈ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. తన సోదరుడు ఎప్పుడూ కూడా లావణ్యను బెదిరించలేదని స్పష్టం చేశారు. అంతేకాదు, తన కుటుంబ సభ్యులకు లావణ్య ఎవరో కూడా తెలియదని, తాను కూడా ఆమెను ఎప్పుడూ చూడలేదని మాల్వీ పేర్కొన్నారు. 

తన కుటుంబం హిమాచల్ ప్రదేశ్ లో నివసిస్తోందని, ఒకసారి షూటింగ్ సందర్భంగా తన కుటుంబ సభ్యులను రాజ్ తరుణ్ కలిశాడని వెల్లడించారు. లావణ్య చేసిన ఆరోపణల్లో నిజంలేదని కొట్టిపారేశారు. త్వరలోనే నిజం బయటికి వస్తుందని అన్నారు. 

రాజ్ తరుణ్ తన సహనటుడు మాత్రమేనని, కలిసి పనిచేశామని స్పష్టం చేశారు. తాము సినిమాల గురించి, షూటింగ్ గురించి మాత్రమే మాట్లాడుకునేవాళ్లమని మాల్వీ వివరించారు. 

లావణ్యే తన కుటుంబ సభ్యులను బెదిరిస్తోందని, ఆమె ఇలా ఎందుకు చేస్తోందో అర్థం కావడంలేదని తెలిపారు. ఈ విషయంలో తాను తప్పకుండా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తానని మాల్వీ మల్హోత్రా వెల్లడించారు.
Malvi Malhotra
Raj Tarun
Lavanya
Tollywood

More Telugu News