Maharashtra: టీమిండియాకు రూ.11 కోట్ల నజరానా ప్రకటించడం అవసరమా?: మహా సీఎంను ప్రశ్నించిన విపక్ష నేత
- నిన్న రోహిత్ శర్మ, సూర్యకుమార్, జైస్వాల్, శివమ్ దూబేలను సత్కరించిన మహారాష్ట్ర సర్కారు
- టీమిండియాకు నగదు నజరానా ప్రకటించిన సీఎం ఏక్ నాథ్ షిండే
- రాష్ట్రం అప్పులపాలై ఉన్న స్థితిలో ఆ నజరానా అవసరమా? అన్న విజయ్ వడేట్టివార్
టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే రూ.11 కోట్ల నజరానా ప్రకటించడం తెలిసిందే. ముంబయి క్రికెటర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబేలను ఏక్ నాథ్ షిండే నిన్న మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్కరించారు. ఈ సందర్భంగానే ఆయన టీమిండియాకు నగదు కానుక ప్రకటించారు.
అయితే, షిండే నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు విజయ్ వడేట్టివార్ తప్పుబట్టారు. రాష్ట్రం అప్పులపాలై ఉన్న స్థితిలో టీమిండియాకు అంత పెద్ద మొత్తం నజరానా ప్రకటించాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. ఆ డబ్బును రైతులకో, యువతకో ఉపయోగించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
గత నాలుగు నెలల్లో రాష్ట్రంలో 1,068 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని... బాధల్లో ఉన్న రైతులకు ఆ డబ్బు ఇస్తే తాను సంతోషించేవాడ్నని విజయ్ పేర్కొన్నారు.