Bandi Sanjay: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటున్నారు?: బండి సంజయ్ ప్రశ్న
- పార్టీ ఫిరాయింపులను చేపట్టవద్దని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పెట్టిందని విమర్శ
- కేకేతో రాజీనామా చేయించిన కాంగ్రెస్... ఎమ్మెల్యేలతో ఎందుకు చేయించడం లేదని నిలదీత
- బీఆర్ఎస్కు, కాంగ్రెస్‌కి పెద్ద తేడా లేదని మండిపాటు
పార్టీ ఫిరాయింపులను చేపట్టవద్దని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పెట్టిందని... అలాంటప్పుడు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
తమ పార్టీలో చేరిన కె.కేశవరావుతో కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయించిందని గుర్తు చేశారు. మరి బీఆర్ఎస్ నుంచి చేరిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఎందుకు రాజీనామా చేయించడం లేదని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారంపై ప్రజలు ఆలోచన చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రూప్-1 నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్కు, కాంగ్రెస్‌కి పెద్దగా తేడా లేదని విమర్శించారు.