Chandrababu: అన్నదమ్ములు విడిపోతే చిన్న చిన్న సమస్యలు వస్తాయ్: చంద్రబాబు
- ఆ సమస్యలు శాశ్వతంగా ఉండవన్న ఏపీ సీఎం
- విడిపోయాక ఎవరి కుంపటి వారిదేనని వ్యాఖ్య
- కష్టపడితే సంపాదన పెరుగుతుంది సుఖపడతారని వెల్లడి
- ఐకమత్యంగా ఇద్దరూ పనిచేస్తే ఇద్దరూ పైకొస్తారన్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్నదమ్ముల్లాగా విడిపోయాయని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్ భవన్ వద్ద ఆదివారం ప్రసంగిస్తూ.. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ముల్లాగా ఐకమత్యంగా ఉండాలని ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు సాగాలనేదే టీడీపీ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. అన్నదమ్ములు విడిపోయినపుడు చిన్న చిన్న సమస్యలు వస్తాయని, అది సహజమేనని చంద్రబాబు చెప్పారు. అయితే, ఆ సమస్యలు శాశ్వతంగా ఉండొద్దని, వాటిని వెంటనే పరిష్కరించుకోవాలని చెప్పారు. ఈ ఉద్దేశంతోనే రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకుందామని ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు.
ఇందులో భాగంగా ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తాను చొరవ తీసుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశానని చెప్పారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి ఇదే ముందడుగని తెలిపారు. తన లేఖకు సానుకూలంగా స్పందించిన తెలంగాణ సీఎంతో నిన్న (శనివారం) సాయంత్రం భేటీ అయ్యానని చంద్రబాబు వివరించారు. అన్నదమ్ములుగా విడిపోయినా కూడా బయటివాడు మన మీదికి వస్తే మనిద్దరం ఒక్కటేనని నిరూపిస్తాం.. అవునా కాదా అంటూ అక్కడున్న జనాలను ప్రశ్నించారు.
అదేవిధంగా, విడిపోయిన తర్వాత ఎవరి కుంపటి వారిదేనని, కష్టపడితే బాగా సంపాదించుకుని సుఖపడతారని చంద్రబాబు చెప్పారు. ఎవరి సంపాదన వారిదేనని, ఐకమత్యంగా ఉంటే ఇద్దరికీ బలమని చెప్పారు. తెలుగు జాతి ఒకటే.. మనం మాట్లాడే భాష ఒకటేనని గుర్తుచేశారు. తెలుగు జాతిని పరిరక్షించుకుంటూ అభివృద్ధిలో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కు లోక్ సభలో 42 మంది ఎంపీలు ఉండేవారని గుర్తుచేశారు. రాష్ట్రం విడిపోయాక ఈ సంఖ్య తగ్గిందని చెప్పారు. ఆంధ్రా, తెలంగాణ అని కాకుండా తెలుగు జాతి ప్రయోజనాలు కాపాడే విషయంలో తాను ముందుంటానని చంద్రబాబు పేర్కొన్నారు.
సమస్యల పరిష్కారానికి సానుకూలమైన చర్చలే మంచి మార్గమని చంద్రబాబు చెప్పారు. గొడవలు పడితే సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని చెప్పారు. సామరస్యంగా కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా సమస్యలు పరిష్కరించుకుని, ఇరు రాష్ట్రాలు అభివృద్ధి వైపు పరుగులు పెట్టాలని తాను కోరుకుంటున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది.. ఆంధ్రాలో ఎన్డీఏ ప్రభుత్వం ఉందని గుర్తుచేశారు. దీంతో సిద్ధాంతాల పరంగా కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావొచ్చని చెప్పారు. శనివారం జరిగిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చలు చాలా వరకు సానుకూలంగా జరిగాయని చంద్రబాబు వెల్లడించారు.