US Shooting Incident: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి, 19 మందికి గాయాలు
- డెట్రాయిట్ నగరంలో ఆదివారం తెల్లవారుజామున ఘటన
- కాల్పుల ఘటనలో ఇద్దరు మృతి చెందగా 19 మందికి గాయాలు
- పూర్తి వివరాలు ఇంకా వెల్లడించని పోలీసులు
- వారాంతం, జులై 4న వేడుకల కారణంగా అమెరికా వ్యాప్తంగా పెరిగిన కాల్పుల ఘటనలు
అమెరికాలో గత వారాంతం పలు ప్రాంతాల్లో కాల్పుల కలకలం రేగింది. మిషిగాన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ నగరంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు మృతి చెందగా 19 మంది గాయపడ్డారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించలేదు. అనుమానితుల్ని ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని కూడా పోలీసు వర్గాలు తెలిపాయి.
వారాంతపు సెలవులు, జులై 4న వేడుకలు వెరసి అమెరికాలోని పలు ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో కాల్పుల ఘటనలు వెలుగు చూశాయి. ప్రజలు అధిక సంఖ్యలో వేడుకల్లో పాల్గొనడం, మద్యం వినియోగం పెరగడం తదితర కారణాలతో గత వారాంతంలో కాల్పుల ఘటనలు పెరిగాయని పరిశీలకులు చెబుతున్నారు.
కాగా, శనివారం కెన్టకీలోని ఫ్లోరెన్స్ ప్రాంతంలో వెలుగు చూసిన కాల్పుల ఘటనలో ఏకంగా నలుగురు కన్నుమూశారు. ఓ ఇంట్లో 21 ఏళ్ల కుమారుడి బర్త్డే పార్టీ జరుగుతుండగా ఈ ఘోరం జరిగింది. 20 ఏళ్ల నిందితుడు వారిపై కాల్పులు జరిపి పారిపోయాడని పోలీసులు తెలిపారు. అతడిని వెంబడించగా నిందితుడి కారు అదుపుతప్పి గొయ్యిలో పడిందన్నారు. అప్పటికే నిందితుడు తనని తాను తుపాకీతో కాల్చుకున్నాడని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు. నిందితుడు బాధితుడికి పరిచయస్తుడేనని, ఆ పార్టీకి అతడికి ఆహ్వానం అందలేదని పోలీసులు తెలిపారు.