President Of India: పూరీ బీచ్ లో రాష్ట్రపతి మార్నింగ్ వాక్

President of india Draupadi Murmu morning walk at Puri beach

  • ‘ఎక్స్’ లో ఫొటోలు షేర్ చేసిన రాష్ట్రపతి భవన్ కార్యాలయం
  • గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం పెరిగిపోవడంపై ద్రౌపదీ ముర్ము ఆందోళన
  • దాని ఫలితాన్ని ఇప్పటికే దేశం అనుభవిస్తోందని వ్యాఖ్య
  • ప్రజలంతా ప్రకృతి పరిరక్షణకు ప్రతినబూనాలని పిలుపు

ఒడిశాలోని పూరీలో ఆదివారం జగన్నాథ రథయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం ఉదయం పూరీ బీచ్ లో మార్నింగ్ వాక్ తో తన దినచర్యను మొదలుపెట్టారు. సాధారణంగా ఎప్పుడూ చీరకట్టులో కనిపించే ద్రౌపదీ ముర్ము.. వాకింగ్ కు వీలుగా ఉండేలా పంజాబీ డ్రెస్ ధరించారు. అలాగే వాకింగ్ షూస్ ధరించి బీచ్ లో కలియదిరిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రాష్ట్రపతి భవన్ కార్యాలయం రాష్ట్రపతి ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది.

ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము భావోద్వేగపూరితమైన పోస్ట్ ను నెటిజన్లతో పంచుకున్నారు. ‘మానవాళి జీవిత సారాంశాన్ని తెలియజెప్పడంతోపాటు మనం ప్రకృతిలో భాగమని గుర్తుచేసే కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. పర్వతాలు, అడవులు, నదులు, సముద్రతీరాలు మనకు అంతర్లీనంగా ఏదో చెబుతుంటాయి. ఈ రోజు తీరం వెంబడి నడిచినప్పుడు అక్కడి పరిసరాల్లో వీస్తున్న పిల్ల గాలులు, అలల హోరు, అనంత సముద్ర జలాలతో కలిసి ఒకే రకమైన అనుభూతిని చెందాను. ఇదో ధ్యాన అనుభూతి. ఇది నాలో అంతర్లీనంగా గాఢమైన శాంతిని కలిగించింది. నిన్న పూరీ జగన్నాథుని దర్శనం చేసుకున్నప్పుడు సైతం నాకు ఇదే అనుభూతి కలిగింది. ఇలాంటి అనుభూతిని నేనేమీ ఒంటరిగా పొందలేదు. మన జీవితాలను అర్థవంతంగా మార్చే, మనల్ని నిలబెట్టే మనకన్నా ఎన్నో రెట్లు పెద్దదైనది ఎదురైనప్పుడు మనమంతా ఇదే అనుభూతి చెందుతాం’ అని రాష్ట్రపతి తన పోస్ట్ లో రాసుకొచ్చారు.

‘రోజువారీ ఉరుకుల పరుగుల జీవితంలో మనం ప్రకృతితో ఉన్న అనుబంధాన్ని కోల్పోతున్నాం. ప్రకృతిని జయించామని భావిస్తూ స్వల్పకాలిక ప్రయోజనాల కోసం ప్రకృతిని నాశనం చేస్తున్నాం. దాని ఫలితాన్ని మనమంతా ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఈ ఏడాది వేసవిలో దేశమంతా వడగాడ్పులతో అల్లాడింది. కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా భారీ వాతావరణ మార్పులు సాధారణం అయిపోయాయి. వచ్చే కొన్ని దశాబ్దాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారబోతోంది’ అంటూ ముర్ము ఆందోళన వ్యక్తం చేశారు.

‘భూమిపై 70 శాతానికిపైగా మహాసముద్రమే విస్తరించింది. గ్లోబల్ వార్మింగ్ వల్ల నిరంతరం సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. ఇది తీరప్రాంతాలకు ముప్పుగా మారుతోంది. మరోవైపు వివిధ రకాల కాలుష్యాల కారణంగా సముద్రాలు, అందులోని మొక్కలు, జీవజాలం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకృతి ఒడిలో నివసించే వారు అనుసరించే సంప్రదాయాలు మన ఈ సమస్యల పరిష్కారానికి దారిచూపుతాయి. ప్రభుత్వ స్థాయిలో పెద్ద ఎత్తున పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టడంతోపాటు ప్రజలంతా ప్రకృతి పరిరక్షణకు చిన్నచిన్న అడుగులు వేస్తే మనం ఈ సమస్యల నుంచి బయటపడతాం. భద్రమైన భవిత కోసం మనమంతా వ్యక్తులుగా ఏం చేయగలమో చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం. భావి తరాల కోసం మనం ఈ పని చేయాలి’ అని ముర్ము మరో పోస్ట్ లో కోరారు.




  • Loading...

More Telugu News