Team India: జింబాబ్వేలో ఉన్న టీమిండియాతో కలిసిన శాంసన్, జైస్వాల్, శివమ్ దూబే
- జింబాబ్వేలో పర్యటిస్తున్న యువ టీమిండియా
- స్వదేశంలో విజయోత్సవాల కారణంగా ఆలస్యంగా జట్టుతో కలిసిన ముగ్గురు ఆటగాళ్లు
- మిగిలిన మూడు టీ20లకు ఆసక్తికరంగా మారిన జట్టు ఎంపిక
భారత్ లో టీ20 వరల్డ్ కప్ విజయోత్సవాల కారణంగా యువ జట్టుతో పాటు జింబాబ్వే వెళ్లలేకపోయిన సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే... కాస్త ఆలస్యంగా జింబాబ్వేలో ఉన్న టీమిండియాతో కలిశారు.
ఇప్పటికే యువ టీమిండియా... జింబాబ్వేతో రెండు టీ20 మ్యాచ్ లు ఆడింది. మిగిలిన మూడు మ్యాచ్ లకు సంజు శాంసన్, జైస్వాల్, శివమ్ దూబే అందుబాటులో ఉండనున్నారు. ఈ ముగ్గురు కీలకమైన ఆటగాళ్లు కావడంతో, జట్టు నుంచి ఎవరిని తప్పించాలన్నది కెప్టెన్ శుభ్ మాన్ గిల్, కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ లకు సమస్యగా మారనుంది.
జింబాబ్వేతో తొలి రెండు మ్యాచ్ ల్లో ఓపెనర్లుగా శుభ్ మాన్ గిల్, అభిషేక్ శర్మ బరిలో దిగారు. అభిషేక్ శర్మ నిన్నటి మ్యాచ్ లో సెంచరీ చేయడంతో అతడి స్థానానికి ఢోకా లేదు. వన్ డౌన్ లో వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ 77, సెకండ్ డౌన్ లో వచ్చిన రింకూ సింగ్ 48 పరుగులు చేసి సత్తా నిరూపించుకున్నారు.
ఇక, యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, సాయి సుదర్శన్, రియాన్ పరాగ్ లకు నిన్నటి మ్యాచ్ లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. తొలి మ్యాచ్ లో జురెల్ 6, పరాగ్ 2 పరుగులే చేశారు. ఈ నేపథ్యంలో, తదుపరి మూడు మ్యాచ్ ల కోసం టీమిండియాలో ఎవరికి స్థానం దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది.