Free Sand Policy: ఏపీలో ఉచిత ఇసుక విధానం ప్రకటించిన కూటమి ప్రభుత్వం... నేటి నుంచి అమలు
- కొన్ని జిల్లాల్లోని స్టాక్ పాయింట్ల నుంచి ఉచిత ఇసుక సరఫరా మొదలుపెట్టిన మంత్రులు
- కొత్త విధానం రూపకల్పన వరకు ఉచిత ఇసుక సరఫరాకు మార్గదర్శకాల జారీ
- ఇసుకపై రాష్ట్ర ప్రభుత్వం రేపు శ్వేతపత్రం విడుదల
ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సీఎంవో నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. మంత్రులు కొన్ని జిల్లాల్లోని స్టాక్ పాయింట్ల వద్ద ఉచిత ఇసుక సరఫరా మొదలు పెట్టారు.
ప్రస్తుతానికి వేర్వేరు స్టాక్ పాయింట్ల వద్ద 49 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు ఉన్నాయి. స్టాక్ పాయింట్ల నుంచి ఉచిత ఇసుక సరఫరా సజావుగా సాగడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
పాత ఇసుక విధానం రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై జిల్లా కలెక్టర్లకు ఇచ్చిన అంతర్గత మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2024 ఇసుక విధానం రూపకల్పన వరకు ఇసుక సరఫరాకు మార్గదర్శకాలు జారీ చేసినట్టు వెల్లడించింది.
కాగా, ఇసుకపై రాష్ట్ర ప్రభుత్వం రేపు శ్వేతపత్రం విడుదల చేయనుంది.