Revanth Reddy: రేవంత్ రెడ్డి గారూ... ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి, లేదంటే ప్రజలు తిరగబడతారు: కేటీఆర్ హెచ్చరిక
- పీర్జాదిగూడలోని నిర్మాణాల కూల్చివేతపై కేటీఆర్ ఆగ్రహం
- 2008లో వైఎస్ హయాంలో ప్లాట్లను క్రమబద్దీకరించారన్న కేటీఆర్
- మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇప్పుడు ఇళ్లను కూల్చి వేయించారని ఆరోపణ
- సుధీర్ రెడ్డిపై ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోవాలని సూచన
పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని సర్వే నంబర్ 1లోని భారీ నిర్మాణాలను సోమవారం ఉదయం అధికారులు కూల్చివేసిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎక్స్ వేదికగా లేఖ రాశారు.
మీ కాంగ్రెస్ నాయకులు అమ్మిన, మీ కాంగ్రెస్ ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేసిన ప్లాట్లలో నిర్మించుకుంటున్న ప్రజల ఇళ్లను మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఏమి ఆశించి ఈరోజు కూలగొట్టించాడో ఒకసారి విచారణ జరిపించాలని సూచించారు. ప్రజా పాలనలో ప్రజలకు మద్దతుగా వెళ్లిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులతో నిర్బంధిస్తారా? మీకు అన్నగా ప్రచారం చేసుకుంటూ సుధీర్ రెడ్డి మేడ్చల్ అసెంబ్లీ పరిధిలో చేస్తోన్న అరాచకాలపై మీరు ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకోండని ముఖ్యమంత్రికి సూచించారు. లేదంటే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. మీ నిర్బంధాలు ప్రజాగ్రహాన్ని నిలువరించలేవన్నారు.
ఇదీ జరిగిందంటూ కేటీఆర్ వివరణ
అమాయక ప్రజలకు ఈ ప్లాట్లను అమ్మింది కాంగ్రెస్ నాయకులు రాందాస్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ కార్పొరేటర్ అమర్ సింగ్ కుటుంబమని తెలిపారు. 2008లో నాటి సీఎం రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ ప్లాట్లను క్రమబద్ధీకరించారని తెలిపారు. గతంలో రెవెన్యూ అధికారులు ఇది పట్టా భూమిగా ఎన్వోసీ జారీ చేశారన్నారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి మున్సిపల్ అధికారుల అనుమతి తీసుకొని చాలామంది ప్రజలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఇళ్లను నిర్మించుకున్నట్లు చెప్పారు. కానీ సుధీర్ రెడ్డి అధికారులను వేధించి... అమాయక ప్రజలు లక్షలు పోసి నిర్మించుకున్న ఇళ్లను ఈ రోజు కూలగొట్టించాడని మండిపడ్డారు.
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని సాయిప్రియ, సత్యనారాయణపురం కాలనీ ప్లాట్ల యజమానుల సమస్యను శాశ్వతంగా తీర్చాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం 118 జీవో పరిధిలో చేర్చి ప్లాట్ ఓనర్స్కు మేలు చేసిందన్నారు. కానీ ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వం అమాయక ప్లాట్ ఓనర్స్ ఇళ్లను కూల్చివేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై కక్షగట్టి చేస్తున్న వేధింపులకు ప్రజలు ముగింపు పలకడం ఖాయమని హెచ్చరించారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చాక వెంటనే ఆ ప్లాట్ ఓనర్లకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
తమ పార్టీకి చెందిన మేయర్ జక్క వెంకట్ రెడ్డిని, కార్పొరేటర్లను వేధిస్తున్నారని ఆరోపించారు. మేం కూడా ఇలా వేధించాలనుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాల్లేకుండా పోయేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు మళ్ళీ వడ్డీ సహా చెల్లిస్తామని హెచ్చరించారు. తమ నాయకులను, మేయర్‌ను, కార్పొరేటర్లను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు.