Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ప్ర‌తిపాదిత‌ షెడ్యూల్ విడుద‌ల‌.. దాయాదుల పోరు ఎప్పుడంటే..!

Champions Trophy 2025 Provisional Schedule Revealed

  • వ‌చ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు టోర్నీ
  • కరాచీ, రావల్పిండి, లాహోర్ వేదిక‌గా మ్యాచ్‌లు
  • ఈ ఐసీసీ మెగా టోర్నీలో పాల్గొననున్న ఎనిమిది దేశాలు 
  • షెడ్యూల్ ప్రకారం త‌న‌ గ్రూప్ మ్యాచ్‌లన్నీ లాహోర్‌లోనే ఆడ‌నున్న‌ భారత్  
  • మార్చి 1న భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌

2025లో పాకిస్థాన్‌ వేదికగా ఛాంపియన్స్‌ ట్రోఫీ జరగనున్న విష‌యం తెలిసిందే. ఈ ఐసీసీ మెగా టోర్నీలో ఎనిమిది దేశాలు పాల్గొననున్నాయి. డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను ఐసీసీకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇప్ప‌టికే పంపించింద‌ని, దాని ప్ర‌కారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనుంద‌ని తెలుస్తోంది. ఇప్పుడు ఛాంపియన్స్‌ ట్రోఫీ ప్రతిపాదిత షెడ్యూల్ విడుదలైనట్లు నిన్న‌టి (ఆదివారం) నుంచి పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

టెలిగ్రాఫ్‌లోని నివేదిక ప్రకారం ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు కరాచీ, రావల్పిండి, లాహోర్ వేదిక‌గా మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇక 8 సంవత్సరాల తర్వాత జ‌రుగుతున్న ఈ టోర్నీని ఐసీసీ 50 ఓవర్ల ఫార్మాట్‌లో నిర్వ‌హించ‌నుంది. గ‌తేడాది భార‌త్ వేదిక‌గా జ‌రిగిన వ‌న్డే ప్రపంచ కప్‌లో టాప్-8లో నిలిచిన జట్లు ఇప్పుడు నేరుగా ఛాంపియ‌న్స్ ట్రోపీ ఆడ‌నున్నాయి. ఈ 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించి, ఒక్కో గ్రూపు నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ-ఫైనల్‌కు వెళ్తాయి.

గ్రూప్‌ల విషయానికొస్తే.. గ్రూప్‌-ఏలో ఆతిథ్య పాకిస్థాన్‌తో పాటు భారత్‌, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్ ఉన్నాయి. అలాగే గ్రూప్-బీలో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌ ఉన్నాయి.

షెడ్యూల్ ప్రకారం భారత్ తన‌ గ్రూప్ మ్యాచ్‌లన్నీ లాహోర్‌లో ఆడనుంది. టీమిండియా త‌న తొలి మ్యాచ్ ను ఫిబ్ర‌వ‌రి 20న‌ బంగ్లాదేశ్‌తో ‌ఆడ‌నుంది. ఆ త‌ర్వాత ఫిబ్ర‌వ‌రి 23న న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఇక‌ భారత్-పాకిస్థాన్‌ మ్యాచ్‌ మార్చి 1న ఉండ‌నుంది. రౌండ్-రాబిన్ దశ మార్చి 2న ముగుస్తుంది. రెండు సెమీ-ఫైనల్‌లు వరుసగా మార్చి 5, 6న కరాచీ, రావల్పిండిలో జరుగుతాయి. ఫైన‌ల్ మ్యాచ్‌ మార్చి 9న లాహోర్‌లో జరుగుతుంది.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 వేదికలు 
లాహోర్: గడాఫీ స్టేడియం 
కరాచీ: నేషనల్ స్టేడియం 
రావల్పిండి: రావల్పిండి క్రికెట్ స్టేడియం
 

మొత్తం 15 మ్యాచుల్లో ఏడు లాహోర్‌లో, మూడు కరాచీలో, ఐదు రావల్పిండిలో జరిగేలా షెడ్యూల్ డిజైన్ చేశారు. అయితే భద్రత, రవాణా కారణాల దృష్ట్యా టీమిండియా మ్యాచులు లాహోర్‌ గడాఫీ స్టేడియంలో ఆడేలా షెడ్యూల్ రూపొందించారు. ఒకవేళ భార‌త జ‌ట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తే అది కూడా అక్కడే జరుగుతుంది. కాగా, ఇప్పటికే ఆటగాళ్ల భద్రత, ఇతర కారణాల దృష్ట్యా 2008 ఆసియా కప్‌ తర్వాత నుంచి పాక్ పర్యటనకు వెళ్లట్లేదు. మరి ఇప్పుడు వెళ్తుందో లేదో. ఇప్పటికే ఇతర సభ్య దేశాలన్నీ ఐసిసికి ఛాంపియన్స్ ట్రోఫీకి తమ మద్దతును తెలిపాయి. కానీ దీనికి బీసీసీఐ నుంచి ఇంకా సమ్మతి రాలేదు. భారత ప్రభుత్వం నిర్ణయం మేరకే బీసీసీఐ తదుపరి నిర్ణ‌యం తీసుకోనుంది. 

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ప్రతిపాదిత షెడ్యూల్ ఇదే..
ఫిబ్రవరి 19: న్యూజిలాండ్ vs పాకిస్థాన్ - కరాచీ
ఫిబ్రవరి 20: బంగ్లాదేశ్ vs భారత్ - లాహోర్
ఫిబ్రవరి 21: ఆఫ్ఘనిస్థాన్‌ vs దక్షిణాఫ్రికా - కరాచీ
ఫిబ్రవరి 22: ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ - లాహోర్
ఫిబ్రవరి 23: న్యూజిలాండ్ vs భారత్ - లాహోర్
ఫిబ్రవరి 24: పాకిస్థాన్ vs బంగ్లాదేశ్ - రావల్పిండి
ఫిబ్రవరి 25: ఆఫ్ఘనిస్థాన్‌ vs ఇంగ్లాండ్ - లాహోర్
ఫిబ్రవరి 26: ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా - రావల్పిండి
ఫిబ్రవరి 27: బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్ - లాహోర్
ఫిబ్రవరి 28: ఆఫ్ఘనిస్థాన్‌ vs ఆస్ట్రేలియా - రావల్పిండి
మార్చి 1: పాకిస్థాన్ vs భారత్ - లాహోర్
మార్చి 2: దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్ - రావల్పిండి
మార్చి 5: సెమీ-ఫైనల్ - కరాచీ
మార్చి 6: సెమీ-ఫైనల్ - రావల్పిండి
మార్చి 9: ఫైనల్‌ - లాహోర్

  • Loading...

More Telugu News