Nimmagadda Prasad: జగన్ అక్రమాస్తుల కేసు.. నిమ్మగడ్డ ప్రసాద్ క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు
- సీబీఐ కేసును కొట్టివేయాలంటూ తెలంగాణ హైకోర్టులో నిమ్మగడ్డ క్వాష్ పిటిషన్
- పిటిషనర్ వాదనతో అంగీకరించని న్యాయస్థానం
- కంపెనీ తప్పులకు చైర్మన్‌గా ఆయన కూడా బాధ్యత వహించాల్సిందేనని స్పష్టీకరణ
వైసీపీ అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తులకు సంబంధించిన వాన్‌పిక్ కేసు నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసింది. జగన్ కంపెనీల్లో రూ. 850 కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా అప్పటి ప్రభుత్వం నుంచి నిమ్మగడ్డ అనేక రాయితీలు పొందారని సీబీఐ తన చార్జ్‌షీట్‌లో పేర్కొంది. క్విడ్ ప్రొ కోలో ఇదంతా భాగమని ఆరోపించింది.
ఈ నేపథ్యంలో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ 2021లో హైకోర్టులో నిమ్మగడ్డ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న దీనిని విచారించిన న్యాయస్థానం.. జగన్ కంపెనీల్లో నిమ్మగడ్డ పెట్టుబడులు క్విడ్ ప్రొ కోలో భాగమా? కాదా? దీనిని లంచంగా భావించాలా? అన్న అంశాలు విచారణలో తేలాల్సి ఉందని వ్యాఖ్యానించింది.
దురుద్దేశంతోనే క్రిమినల్ కేసు పెట్టారన్న పిటిషనర్ వాదనతో ఏకీభవించడం లేదని స్పష్టం చేసింది. అలాగే, కేసు పెట్టడానికి తగిన ఆధారాలు, కారణాలు లేవన్న పిటిషనర్ వాదనను కూడా తిరస్కరిస్తున్నట్టు పేర్కొంది. కంపెనీ చేసిన తప్పులకు తాను బాధ్యుడిని కానని చైర్మన్ తప్పించుకోలేరని, కాబట్టి ఆయన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు కోర్టు పేర్కొంది.