Mumbai Rains: ముంబైకి భారీ వర్ష సూచన.. విద్యాసంస్థల మూత.. రైళ్లు, విమాన సర్వీసులకు అంతరాయం
- నిన్న ముంబైని ముంచెత్తిన వర్షం
- ఆరు గంటల్లో 300 మిల్లీమీటర్ల వాన
- వాతావరణశాఖ హెచ్చరికలతో విద్యాసంస్థల మూత
- ముంబై యూనివర్సిటీ పరిధిలో నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా
భారీ వర్షాలతో దేశ ఆర్థిక రాజధాని ముంబై అతలాకుతలం అవుతోంది. నిన్న కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. కేవలం ఆరు గంటల్లోనే ఏకంగా 300 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తాజాగా, నేడు కూడా నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ జారీచేసింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ముంబై, థానే, నవీ ముంబై, పన్వెల్, పూణే, రత్నగిరి-సింధుర్గ్ ప్రాంతాల్లోని స్కూల్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది. ముంబై యూనివర్సిటీ పరిధిలో నేడు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసింది.
ఇక నిన్న కురిసిన కుండపోత వర్షానికి బస్సు, రైళ్లు, విమాన సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. ముంబైకి చేరుకోవాల్సిన పలు రైళ్లు ఇతర స్టేషన్లలో చిక్కుకుపోయాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో దాదాపు 50 విమానాలు రద్దయ్యాయి. నేడు కూడా పలు పలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. 40 చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడడంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. 12 చోట్ల షార్ట్ సర్క్యూట్ అయింది. శాంతాక్రజ్ ఈస్ట్‌లో విద్యుదాఘాతంలో 72 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది.