Allapur gurukulam: బిల్డింగ్ పై నుంచి కింద పడిన అల్లాపూర్ గురుకుల విద్యార్థిని.. ఆత్మహత్యాయత్నమా.. తోసేశారా..?

Student fall down From Hostel Second Floor In Allapur Gurukulam
  • ఎవరో తోసేశారని ఆరోపిస్తున్న బాలిక
  • సూసైడ్ అటెంప్ట్ చేసిందంటున్న ప్రిన్సిపాల్
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తల్లిదండ్రులు
అల్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని బిల్డింగ్ పై నుంచి పడిపోయింది. తీవ్ర గాయాలపాలైన విద్యార్థిని ప్రిన్సిపాల్ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ విద్యార్థిని పరిస్థితి సీరియస్ గా ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే, సదరు విద్యార్థిని ఆత్మహత్యా ప్రయత్నం చేసిందని ప్రచారం జరుగుతుండగా.. ఆసుపత్రిలో ఉన్న విద్యార్థిని మాత్రం తనను ఎవరో కిందకి తోసేశారని ఆరోపిస్తోంది. దీంతో అసలేం జరిగిందనేది సస్పెన్స్ గా మారింది.

బాధిత స్టూడెంట్ ఏమంటోందంటే..
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండ‌లం అల్లాపూర్ శివారులోని గురుకుల పాఠశాలలో బేగరి మల్లీశ్వరి (15) పదో తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం 7 గంటలకు మరో విద్యార్థినితో కలిసి హాస్టల్ బిల్డింగ్ పైకి వెళ్లింది. కాసేపటికి తోడుగా వచ్చిన విద్యార్థిని కిందికి వెళ్లిపోగా.. మల్లీశ్వరి మాత్రం అక్కడే ఉండిపోయింది. వరండా సైడ్ వాల్ ఎత్తుగా ఉండడంతో ఓ బకెట్ పైన నిల్చుని వాతావరణాన్ని ఆస్వాదిస్తుండగా.. తన కాళ్లు పట్టుకుని ఎవరో తోసేశారని మల్లీశ్వరి చెబుతోంది.

దీంతో సైడ్ వాల్ పట్టుకుని దాదాపు పది నిమిషాల పాటు వేలాడానని, పట్టు తప్పడంతో కిందపడిపోయానని తెలిపింది. రెండో అంతస్తు నుంచి కిందపడడంతో మల్లీశ్వరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రిన్సిపాల్ వెంటనే మల్లీశ్వరిని తొలుత జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి, ఆపై సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మల్లీశ్వరి బ్యాక్ బోన్, కుడికాలు, పక్కటెముకలు విరిగాయని డాక్టర్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మల్లీశ్వరిని హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు.

మానసిక స్థితి బాలేదు: ప్రిన్సిపాల్
మల్లీశ్వరి మానసిక స్థితి బాలేదని, అందుకే ఆత్మహత్యాయత్నం చేసి ఉండొచ్చని ప్రిన్సిపాల్ చెబుతున్నారు. తోసేశారని చెబుతున్న మాటల్లో నిజంలేదని చెప్పారు. అయితే, తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని మల్లీశ్వరి తల్లిదండ్రులు చెబుతున్నారు. మల్లీశ్వరి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు. గురుకుల పాఠశాలను సందర్శించి, ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Allapur gurukulam
Student
Fall down
Hostel Building
suicide attempt

More Telugu News