Rahul Dravid: రాహుల్ ద్రవిడ్‌తో కేకేఆర్ సంప్రదింపులు.. ఏ రోల్ కోసమో తెలుసా?
- టీమిండియా హెడ్ కోచ్‌గా ముగిసిన ద్రవిడ్ పదవీ కాలం
- దీంతో అతని కోసం పోటీ పడుతున్న కొన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలు
- అన్ని ఫ్రాంచైజీల కన్నా ముందుగా కేకేఆర్ సంప్రదించినట్లు వార్తలు
- మెంటార్‌గా బాధ్యతలు తీసుకోవాలని ద్రవిడ్‌ను కోరిన నైట్‌రైడర్స్
ఈ టీ20 వరల్డ్‌కప్‌తో టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవి కాలం ముగిసిన విషయం తెలిసిందే. దీంతో ద్రవిడ్ పై కొన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలు కన్నేశాయని సమాచారం. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందే అతడిని ఎలాగైనా దక్కించుకోవాలని కొన్ని ఫ్రాంచైజీలు చూస్తున్నట్లు తెలుస్తోంది.
ద్రవిడ్ కోసం సదరు ఫ్రాంచైజీలు విపరీతంగా పోటీ పడుతున్నట్లు తెలిసింది. కోచ్‌గా లేదా మెంటార్‌గా జట్టులోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి. అయితే, న్యూస్ 18 బంగ్లా ప్రకారం, ద్రవిడ్ కోసం అన్ని ఫ్రాంచైజీల కన్నా ముందుగా కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) సంప్రదించిందని సమాచారం. కోచ్‌గా కాకుండా మెంటార్‌గా బాధ్యతలు తీసుకోవాలని ద్రవిడ్‌ను కేకేఆర్ కోరిందని తెలుస్తోంది.
2024 ఐపీఎల్ సీజన్‌లో జట్టును విజేతగా నిలిపిన కేకేఆర్ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. దాంతో అతని స్థానంలో ద్రవిడ్‌ను మెంటార్‌గా నియమించాలని కేకేఆర్ భావిస్తోంది. గౌతీ ఇప్పటికే శిబిరాన్ని విడిచిపెట్టడంతో నైట్ రైడర్స్ అతని వారసుడిగా ద్రవిడ్‌ను నియమించాలని యోచిస్తోంది.
గౌతం గంభీర్ మొదట లక్నో సూపర్ జెయింట్స్ కోచ్, మెంటార్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మెంటార్‌గా వచ్చాడు. వస్తూవస్తూనే ఆ జట్టు ఐపీఎల్ 2024లో టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇక టీమిండియా హెడ్ కోచ్‌గా ద్రవిడ్ ఎన్నో ఘనతలు సాధించిన సంగతి తెలిసిందే. 2022 టీ20 ప్రపంచ కప్‌లో సెమీస్‌కు వెళ్లిన భారత జట్టు, 2023 వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు, 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరింది. ఇక ఇటీవల జరిగిన 2024 టీ20 వరల్డ్‌కప్‌లో విజేతగా నిలిపారు. ఈ విజయంలో రాహుల్ ద్రవిడ్‌ది ప్రధాన పాత్ర అని చెప్పొచ్చు. ఈ విషయాన్ని కోహ్లీ, రోహిత్ కూడా చెప్పారు. అందుకే ఇప్పుడు ద్రవిడ్ టీమిండియా కోచ్ పదవికి గుడ్‌బై చెప్పడంతో అతడిపై ఐపీఎల్ ప్రాంఛైజీలు కన్నేశాయి.